logo

ఉద్యానాలు.. ఆక్రమించేశారు

హైదరాబాద్‌ శివారులోని దుండిగల్‌ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు.

Published : 20 May 2024 02:29 IST

తప్పుడు పత్రాలతో రూ.100 కోట్ల విలువైన భూములు సొంతం
అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రయత్నాలు.. అడ్డుకున్న అధికారులు

క్లబ్‌హౌస్‌ నిర్మాణంలో మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటుచేస్తున్న దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ, అధికారులు 

ఈనాడు,హైదరాబాద్, దుండిగల్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ శివారులోని దుండిగల్‌ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. వాటిని విడగొట్టి అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో నివాసముండే వారి కోసం క్లబ్‌హౌస్, ఈత కొలను నిర్మాణానికి ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో పిల్లర్లు నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఎ నుంచి అనుమతులు కూడా పొందారు. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న 3 ఎకరాల భూములు దుండిగల్‌ సమీపంలోని బాహ్య వలయ రహదారికి సమీపంలో ఉండడంతో వేగంగా విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు మున్సిపాలిటీ అధికారులకు వివరించగా.. వారు స్పందించి చర్యలు చేపట్టారు. ఆ భూముల్లో మున్సిపాలిటీకి చెందిన భూములంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆక్రమించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు.

పార్కు స్థలాల్లో ఆక్రమణలు 

గ్రామ పంచాయతీ లేఅవుట్లను అధ్యయనం చేసి... 

దుండిగల్‌ మున్సిపాలిటీకి చెందిన ఉద్యానాల భూములను సొంతం చేసుకునేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్లను అధ్యయనం చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ ఏర్పడకముందు గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లను పరిశీలించారు. వాటి సర్వే నంబర్లను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కేవీఆర్‌ లేఅవుట్‌ పేరుతో 54 ఎకరాల్లో ప్లాట్లు ఏర్పాటు చేశారు. ప్రజాఅవసరాల కోసం లేఅవుట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో మూడెకరాలను గ్రామ పంచాయతీకి ఇచ్చారు. ఐదేళ్ల క్రితం దుండిగల్‌ మున్సిపాలిటీ ఏర్పడడంతో ఈ మూడెకరాలు మున్సిపాలిటీ ఆధీనంలోకి వచ్చాయి. అప్పట్లో ఉన్న అధికారులు వీటిని పట్టించుకోలేదని తెలుసుకున్న ప్రైవేటు వ్యక్తులు.. ఆ లేఅవుట్‌ వేసిన వ్యక్తి.. తమకు స్థలాలు విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఒకట్రెండేళ్లపాటు మౌనంగా ఉన్న అనంతరం పార్కు స్థలాలను సొంతం చేసుకొని కంచెలు నిర్మించారు. 

హెచ్‌ఎండీఏ అనుమతులతో నిర్మాణాలు

ఉద్యానాల కోసం ఆక్రమించిన భూముల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతులు తీసుకుంటే దుండిగల్‌ మున్సిపల్‌ అధికారులకు అనుమానం వస్తుందన్న ముందస్తు అంచనాతో.. స్థలాన్ని ఎక్కువగా చూపించి బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతులివ్వాలంటూ హెచ్‌ఎండీఎకు మూడేళ్ల క్రితం దరఖాస్తు చేశారు. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సర్వే నంబర్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా? అని పరిశీలించకుండా హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులిచ్చేశారు. అనుమతులు వచ్చిన కొద్దిరోజులకు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కేవీఆర్‌ లేఅవుట్‌లో వేర్వేరు చోట్ల ఉన్న ఉద్యానాల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. అపార్ట్‌మెంట్లు నిర్మించనున్న స్థలాల్లో ముందుగా ఒకచోట రేకుల షెడ్డు నిర్మాణం.. మరోచోట క్లబ్‌ హౌస్‌.. ఇంకోచోట ప్రహారీలను నిర్మించారు. ఒకచోట బహుళ అంతస్తుల భవనం నిర్మించారన్న అనుమానంతో మున్సిపల్‌ అధికారులు డిజిటల్‌ సర్వే చేపట్టారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని