logo

అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్‌ శాతాన్ని పోల్చుకుంటున్నారు.

Published : 20 May 2024 06:36 IST

చేవెళ్ల ఎంపీ పరిధిలోని పలు సెగ్మెంట్లలో తగ్గిన పోలింగ్‌ట
గెలుపు అవకాశాలపై అభ్యర్థుల ధీమా

ఈనాడు,హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్‌ శాతాన్ని పోల్చుకుంటున్నారు. అత్యధికంగా చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్‌లో 56.50శాతం పోలింగ్‌ నమోదయ్యింది. గతేడాది శాసనసభ ఎన్నికలతో పోలిస్తే మాత్రం నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఆసక్తి ప్రదర్శించగా.. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల, మల్కాజిగిరి పరిధుల్లోని శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు సొంతూళ్లకు వెళ్లడం ప్రభావం చూపించింది.


పోటాపోటీ.. అయినా అంతంతే..

అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసినా.. ఓటర్లు పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 37.80లక్షల మంది ఓటర్లుండగా.. 17.74లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 21.30లక్షల ఓటర్లకు గాను... 10.68లక్షల మంది, హైదరాబాద్‌లో 22.10లక్షల మంది ఓటర్లుండగా... 10.90లక్షల మంది ఓట్లు వేశారు.


83వేల ఓట్లు... చేవెళ్ల గెలుపోటములపై ప్రభావం.. 

 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే... చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 83వేల ఓట్లు తగ్గాయి. శాసనసభ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 17,40,046 ఓట్లు పోలవగా... తాజా లోక్‌సభ ఎన్నికల్లో 16,57,107 ఓట్లు పోలయ్యాయి. ఒక్క రాజేంద్రనగర్‌ సెగ్మెంట్‌లో మాత్రం మూడువేల ఓట్లు పెరిగాయి. మొత్తంమ్మీద ఓటింగ్‌ తగ్గడంతో గెలుపోటములపై ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఓట్లు తగ్గడంతో తామే గెలుస్తామని భాజపా, భారాస అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ లెక్కలు వేసుకుంటున్నారు. ఓట్లు తగ్గినా... మరింత మెజారిటీతో విజయం సాధిస్తామని రంజిత్‌రెడ్డి నమ్మకంతో ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని