logo

రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు

హైదరాబాద్‌ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది.

Updated : 20 May 2024 07:24 IST

నిర్వహణ పోను సంస్థకు మిగులే.. 

ఈనాడు,హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. సగటున ఒక్కో ప్రయాణికుడు రూ.35 చెల్లించి మెట్రోలో వెళుతుండగా.. సగటు ప్రయాణ దూరం(12.5 కి.మీ.) కూడా తక్కువగానే ఉంది. ప్రయాణికుల నుంచి ఛార్జీలే కాకుండా ప్రకటనలు, స్టేషన్లు, మాల్స్‌ లీజింగ్‌ ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆపరేషన్స్, ఇతరత్రా కలిపి రూ.703.20 కోట్ల ఆదాయం వచ్చింది. మెట్రో నిర్వహణ వ్యయం రూ.429 కోట్లుగా సంస్థ పేర్కొంది. నికరంగా చూస్తే లాభమే కదా? మరి నష్టాలు ఎక్కడివి అంటారా..? మెట్రోరైలు, మాల్స్‌ నిర్మాణానికి రూ.12,500 కోట్లపైన ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ కొంత ఈక్విటీ, మిగిలింది బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తెచ్చింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి.. ఏటా రుణాలపై వడ్డీనే రూ.1273 కోట్లు అని తన ఆర్థిక నివేదికలో పేర్కొంది. అయితే, ఈ వడ్డీ భారాన్ని 2024 ఆర్థిక సంవత్సరంలో కొంతమేర తగ్గించుకుంది. 
మాల్స్, భూముల సబ్‌లీజుపై.. గత ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్ల వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం ఇచ్చింది. రాయదుర్గంలోని 15 ఎకరాల భూమిని రూ.1045 కోట్లకు మానిటైజ్‌ చేసింది. ఇందులో గతేడాది రూ.512 కోట్లు ఎల్‌ అండ్‌టీకి చేరాయి. ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్‌సిటీ మాల్స్‌ను సబ్‌లైసెన్స్‌ ద్వారా రూ.3 వేల కోట్లకు మరో సంస్థతో ఒప్పందం చేసుకుంది. వీటన్నింటిని ద్వారా రూ.5 వేల కోట్ల రుణభారాన్ని దించుకునే దిశగా సర్దుబాట్లు చేసింది. ఫలితంగా వడ్డీ భారం గణనీయంగా తగ్గనుంది. 


ఆదాయం పెరగాలంటే.. 

  • ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరగాలి. రద్దీని తట్టుకునేందుకు అదనపు మెట్రోరైళ్లు కావాలి. ప్రస్తుతమున్న 3 కోచ్‌లను 6కు పెంచాలి. 
  • ప్రయాణికుల వేళల్ని ప్రయోగాత్మకంగా సోమ, శుక్రవారం రోజు మాత్రమే పెంచారు. ప్రజల డిమాండ్‌ మేరకు ప్రతిరోజూ పెంచిన వేళల ప్రకారమే నడపాలి. కుదిరితే అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రోరైలు అందుబాటులో ఉండాలి.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని