logo

పది గంటలకే పార్కులకు తాళం

విశ్రాంతి లేని నగరం హైదరాబాద్‌. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి.

Updated : 20 May 2024 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌ : విశ్రాంతి లేని నగరం హైదరాబాద్‌. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. రోజూ 5లక్షల మంది నగరవాసులు రాత్రి విధులు నిర్వర్తిస్తుంటారని అంచనా. హైదరాబాద్‌ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ సంస్థల సర్వేలు కోడై కూస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మాత్రం కోడికూయగానే పార్కులను తెరచి, కాస్త పొద్దెక్కగానే తాళం వేస్తోంది. సందర్శకుల తాకిడికి తగ్గట్టుగా పార్కుల్లోని సేవలను మరింతగా విస్తరించాల్సిన అధికారులే.. సమయమంటూ ఉద్యానవనాలను నగరవాసులకు దూరం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

రూ.వందల కోట్లు వ్యయం చేస్తున్నా..

గత ప్రభుత్వం హరిత పద్దు పేరుతో పది శాతం ఆదాయాన్ని పచ్చదనం అభివృద్ధికి కేటాయించాలని చట్టం చేసింది. ఆమేరకు జీహెచ్‌ఎంసీ పద్దులో ఏటా రూ.250కోట్ల నిధులను పార్కులు, పచ్చదనం అభివృద్ధికి కేటాయిస్తున్నారు. అంతగా ప్రజాధనాన్ని వెచ్చించి అభివృద్ధి చేస్తోన్న ఉద్యానవనాలను కొందరు జోనల్‌ అధికారులు.. నిర్ణీత సమయాలను నిర్దేశిస్తూ ప్రైవేటు ఆస్తుల్లా మార్చుతున్నారన్న ఆరోపణలున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా..

ఉదయం 5.30గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు ఉద్యానాల తలుపులు తెరచి ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇందిరాపార్కు, లుంబినీపారు, లేక్‌వ్యూ, బాగ్‌లింగంపల్లి, నెక్లస్‌రోడ్డు, జలగం వెంగళరావుపార్కు, కృష్ణకాంత్‌పార్కు, ఇతరత్రా పెద్ద పార్కులు,  కాలనీ పార్కులు ఆమేరకే పని చేస్తున్నాయి. అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలోని కొందరు అధికారులు భద్రతా సిబ్బందికి ఇతర పనులు అప్పగించి పార్కులకు ఉదయం 10గంటల తర్వాత తాళం వేయిస్తున్నారు. కొందరు జోనల్‌ కమిషనర్లూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇటీవల కూకట్‌పల్లి జడ్సీ కార్యాలయం ఆదేశాలతో పార్కుల విభాగం.. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులోని పార్కులన్నింటికీ సమయ వేళలు కేటాయించి తాళం వేయడం వివాదానికి తావిచ్చింది.   ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ జోన్లలోనూ క్రమంగా ఒక్కో పార్కుకు తాళం పడుతుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని