logo

పెట్టుబడులకు లాభాలంటూ మోసం

ఆయుర్వేదిక్‌ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు.

Published : 21 May 2024 01:18 IST

రూ.8 కోట్లు వసూలు చేసిన నిందితులు

ఈనాడు-హైదరాబాద్‌: ఆయుర్వేదిక్‌ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. లాభాలు ఇవ్వలేకపోతే.. ప్లాట్లు ఇస్తామంటూ ప్రచారం చేసి దాదాపు 20 మంది నుంచి సొమ్ము వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. నిందితుల మాటలు నమ్మి ఓ వ్యక్తి రూ.25 లక్షలు డిపాజిట్‌ చేయగా తొలుత జగద్గిరిగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తులో బాధితుల మొత్తంవిలువ రూ.8.23 కోట్లకు పెరగడంతో కేసును సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. 

తవ్వేకొద్దీ బయటకు.. జగద్గిరిగుట్ట ఠానా పరిధి అల్విన్‌ కాలనీకి చెందిన ఓ న్యాయవాదికి (44) తెలిసిన వ్యక్తులద్వారా వనస్థలిపురం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కాలనీకి చెందిన అందెల రమేశ్, ఆయన కుమారుడు క్రాంతి పరిచయమయ్యారు. తాను తన్విత ఆయుర్వేదిక్‌ డెవలపర్స్‌ సంస్థ యజమానినని రమేశ్‌ నమ్మించేవాడు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే, మంచి లాభాలు వస్తాయని ప్రచారం చేశాడు. దీంతో న్యాయవాది పెట్టుబడి సొమ్ము కింద రూ.25 లక్షలు రమేశ్‌కు ఇచ్చాడు. డబ్బు చెల్లించే సమయంలో రమేశ్‌ కోడలు మనోజ్ఞ ఉన్నారు. లాభాలు ఇవ్వలేకపోతే.. తన పేరిట ఉన్న ప్లాట్లను ఇస్తానని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వలేదు, ప్లాటు రాసివ్వలేదు. న్యాయవాది జగద్గిరిగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌ దర్యాప్తు చేయగా మోసం బయటపడింది. నిందితుడు గతంలో వనస్థలిపురం ఠాణా పరిధిలోనూ డబ్బు వసూలు చేసిన కేసులో నిందితుడని తేలింది. 

20 మంది నుంచి.. వనస్థలిపురం ఠాణా పరిధిలో గతేడాది అక్టోబరులో పెట్టుబడులకు లాభాలు పేరుతో డబ్బు వసూలు చేసిన వ్యవహారంలో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోన నర్సిరెడ్డిని విచారించగా.. తనతో పాటు 21 మంది ఉన్నారని, అందులో రమేశ్‌ ఒకరని వాంగ్మూలం ఇచ్చాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న రమేశ్‌ అల్విన్‌కాలనీసహా పలుప్రాంతాల్లో మోసాలు ప్రారంభించినట్లు, 20మంది నుంచి రూ.8.23 కోట్లు వసూలు చేసినట్లు జగద్గిరిగుట్ట పోలీసులు తేల్చారు. కేసును సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ఆ పోలీసులు రమేశ్, క్రాంతి,మనోజ్ఞ ముగ్గురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు