logo

కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?

కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది.

Published : 21 May 2024 01:19 IST

ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు మహిళల హెచ్చరిక

బషీరాబాద్, న్యూస్‌టుడే: కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుల కథనం ప్రకారం.. బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్‌కు చెందిన మాణెమ్మకు లక్ష్మి, అమృత, శ్రుతిక అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. ఏడెనిమిదేళ్ల కిందట బ్యాంకు రుణం తీసుకుందామని, భూమి కుదువ పెడతామని చెప్పి తనను అమృత, ఆమె భర్త బాల్‌రాజ్‌ మోసం చేశారని, 7.20 ఎకరాలకు పట్టా చేయించుకున్నారని మాణెమ్మ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. హక్కు ప్రకారం.. ఆ భూమిలో తమకూ వాటా ఇవ్వాలని మిగతా ఇద్దరు కుమార్తెలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసు సంఖ్య తదితర వివరాలను ధరణిలో నమోదు చేయించారు. అయినా ఆ భూమి పట్టా మార్పిడికి అనుగుణంగా అన్‌లాక్‌ ఎలా అయిందని, స్లాట్‌ ఎలా బుక్కయిందని మాణెమ్మ, లక్ష్మి, శ్రుతికలు సోమవారం తహసీల్దార్‌ వెంకటేశ్, ఉప తహసీల్దార్‌ వెంకటయ్యలతో వాగ్వాదానికి దిగారు. పెట్రోల్‌ డబ్బా చేతపట్టుకొని తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు పెట్రోల్‌ డబ్బా లాక్కొని వారిని నివారించారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ధరణిలో సర్వే సంఖ్యకు కోర్టు కేసు వివరాలు అనుసంధానం చేస్తే లాక్‌ అవుతుందని, ఎలా అన్‌లాక్‌ అయిందనేది విచారణలో తేలుస్తామని తహసీల్దారు తెలిపారు. పట్టా మార్పిడికి స్లాట్‌ బుక్కయ్యాక, రిజిస్ట్రేషన్‌ ఆపే అధికారం తమ చేతిలో ఉండదని పేర్కొన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని