logo

పిడుగుపాటుకు మరొకరి మృతి

జిల్లాలో తాండూరు, కొడంగల్‌ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 21 May 2024 01:22 IST

ముగ్గురికి గాయాలు 

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో తాండూరు, కొడంగల్‌ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ఆదివారం పిడుగు పాటుతో ముగ్గురు రైతులు దుర్మరణం చెందిన ఘటన మరువక ముందే పాత తాండూరులో మరో వ్యక్తి పిడుగు పాటుతో దుర్మరణం చెందాడు. తాండూరు పట్టణ ఎస్సై రాములు, స్థానికులు తెలిపిన ప్రకారం తాండూరు పట్టణం పాత తాండూరుకు చెందిన పుర్రు శేఖర్‌ (39) స్థానికంగా టీ కొట్టు నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బహిర్భూమికి బయటికి వెళ్లాడు. వర్షం కురవడంతో సమీపంలోని చెట్టుకిందకు చేరుకున్నాడు. ఇదే సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

స్పృహ కోల్పోయిన బాలుడు

పాత తాండూరులోనే ఇంటి నుంచి క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు ఎం.హన్మంతు వర్షం కురవడంతో చెట్టుకిందకు వచ్చాడు. సమీపంలోనే పిడుగు పడడంతో స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్‌కు తరలించారు.


కొడంగల్‌: కొడంగల్‌ మండలంలోని పెద్దనందిగామ గ్రామంలో తయాబలి అనే రైతు పొలంలో కూలీలు వరి పంట నూర్పిడి చేస్తున్నారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడటంతో పొలంలోని గుడిసెలోకి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో సమీపంలో పిడుగు పడటంతో కూలీల్లోని హఫీజ్‌ ఫారుక్, ముస్లియా, సుల్తాన్‌మియాలు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరందరినీ కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని