logo

వరద పారే దారేది..?

జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు.

Updated : 21 May 2024 05:12 IST

తాండూరులో రూ.16 కోట్ల కాలువ అసంపూర్ణం

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. దశాబ్దాల నుంచి ఎగువ నుంచి వస్తున్న వరద సవ్యంగా ప్రవహించే పరిస్థితిలేక నివాస గృహాలను చుట్టుముట్టేస్తోంది. నాపరాయి పరిశ్రమలను ముంచేస్తోంది. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు వారగా ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీని పరిష్కారానికి చేపట్టిన కాలువ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మళ్లీ ఈ వర్షాకాలంలో వరద సమస్య తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

3.కిమీ. పొడవునా చేపట్టాలి

పట్టణంలో వర్షాకాలంలో ఎగువ నుంచి వస్తున్న వరదను కాలువల ద్వారా పారించి చిలుక వాగు ద్వారా కాగ్నానదిలోకి వెళ్లేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం 3 కిలో మీటర్ల పొడవునా ‘స్మార్ట్‌ వాటర్‌ డ్రెయిన్‌’ చేపట్టాలని తలంచారు. దీనికి రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్లు 2022లోనే అంచనాలను అప్పటి ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు ప్రజారోగ్య, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ ద్వారా రూ.16 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా హైదరాబాద్‌ రోడ్డు నుంచి పాత తాండూరు పంప్‌హౌస్‌ చిలుక వాగు వరకు మూడు కిలో మీటర్ల పొడవునా స్మార్ట్‌ డ్రెయిన్‌ నిర్మించాల్సి ఉంది.

నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉన్నా..

స్మార్ట్‌ డ్రెయిన్‌ నిర్మాణం కోసం 2023 అక్టోబరు 6న శంకుస్థాపన జరిగింది. ఈ మే నెల చివరి వరకు పూర్తి కావాలి. జూన్‌లో ఎగువన కురిసే వర్షం వరదగా మారి కాలువ ద్వారా చిలుక వాగు నుంచి ప్రవహించి కాగ్నానది లో కలవాలన్నది ఉద్దేశం. ఇలా జరిగితే యేటా వరద నీటి నిల్వతో ఇబ్బందులు పడే పట్టణంలోని సాయిపూరు, తులసీ నగర్, మార్కండేయ నగర్, గ్రీన్‌సిటీ, అయ్యప్పనగర్‌ వాసులతో పాటు పాత తాండూరు చిలుక వాగు పరివాహక ప్రాంత వాసులు సమస్య నుంచి విముక్తి పొందుతారు.


ఇరువైపులా  అంతే ..

పట్టణ సమీపం హైదరాబాద్‌ రోడ్డుకు ఇరువైపులా కి.మీ. పొడవునా కాలువ అసంపూర్ణంగా నిర్మాణమైంది. కాలువల్లోకి వెళ్లాల్సిన ప్రదేశాలు కల్వర్టుల మాదిరి పటిష్ఠ నిర్మాణాలు జరగాల్సి ఉంది. వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. సగంలోనే ఆగిపోయిన కాలువ ప్రదేశం నుంచి సాయిపూరు వైపు నిర్మించాల్సినది ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చిన వరద గృహాలలోకి రాకుండా ఉండేందుకు స్థానికులు తాత్కాలిక కచ్చా కాలువను నిర్మించుకున్నారు. ప్రస్తుతం అది కూడా పూడుకు పోయింది. ఈసారి వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరదను నేరుగా చిలుక వాగులోకి మళ్లించే ఏర్పాట్లు చేస్తే స్థానికులు కాస్త ఇబ్బందులకు దూరంగా ఉంటారు.


బిల్లు చెల్లించనందుకే పనులు ఆగాయి

-శ్రీనివాస్, డీఈఈ, రహదారులు, భవనాల శాఖ, తాండూరు

మొదటి దశలో చేపట్టాల్సిన కిలో మీటరున్నర పొడవు కాలువ నిర్మాణానికి గాను కిలో మీటరు పొడవునా నిర్మాణమైంది. ఇందుకు సంబంధించి గుత్తేదారుకు రూ.1.5 కోట్లు బిల్లును చెల్లించాల్సి ఉంది. చిలుక వాగును అనుసంధానించే కాలువ నిర్మాణానికి కూడా నిధులు లేవు. మంజూరైతే పనులు వేగవంతం అయ్యేలా చూస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని