logo

ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష

పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు.

Published : 21 May 2024 01:26 IST

ప్రతి గురువారం ప్రత్యేక వైద్య సేవలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్, పరిగి: పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా గర్భిణులు ప్రసవించిన తర్వాత వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరక మార్పులతో అవస్థలు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో మానసికంగా కుంగిపోతుంటారు. రాష్ట్రంలో కాన్పు తర్వాత తల్లులు మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కాన్పు తర్వాత తల్లులకు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రసవించిన తర్వాత తల్లులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కార్యక్రమాన్ని జిల్లాలో ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారుగా 2400 మంది సేవలు అందుకున్నారు. ప్రతి గురువారం గర్భిణులకు, తల్లులకు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య భద్రతా చర్యలు సూచిస్తున్నారు.

ఏడాదిలో 10,800 ప్రసవాలు

జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 10,800 ప్రసవాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 25 పీహెచ్‌సీలు, అర్బన్‌ ఆసుపత్రులు, 4 బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ప్రసవం అనంతరం ఆరు వారాల వరకు వివిధ దశల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదట డిశ్ఛార్జి  అయ్యే క్రమంలో వైద్యులు, తదుపరి రెండోసారి సమీప పీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన నాలుగు సార్లు ఆశాలు, ఏఎన్‌ఎంలు ఇంటికి వెళ్లి తల్లితో పాటు శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవసరం మేర వైద్యులు వద్దకు తీసుకెళ్తున్నారు.మొత్తం 42 రోజులు పాటు ఈ తరహాలో వారి పట్ల అనుశీలన కొనసాగుతోంది.  

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 

జిల్లాలో ప్రతి గురువారం ఆరోగ్య కేంద్రాల్లో సేవలను ప్రత్యేకంగా అందించాలని నిర్ణయించింది. నిర్దేశిత రోజున ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రసవం పూర్తి చేసుకొని ఆరు వారాల గడిచిన తల్లులను ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుస్తారు. కేంద్రాల్లో రక్తశాతం, రక్తపోటు, చక్కెర పరీక్షలు నిర్వహిస్తారు. కావాల్సిన ఔషధాలు అందిస్తారు. అవసరం మేర పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. 


మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి

- డాక్టర్‌ సాయిబాబా, జిల్లా కార్యక్రమ అధికారి 

ఇప్పటికే ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నాం. గురువారం ప్రత్యేకించి ప్రసవానంతరం తల్లులకు వివిధ రకాల పరీక్షలు చేపడుతున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలను అందజేస్తున్నారు. కొందరు తల్లులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయవద్దు. తప్పని సరిగా సద్వినియోగం చేసుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని