logo

సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయాలు

జిల్లాలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

Published : 21 May 2024 01:32 IST

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ టౌన్, తాండూరు రూరల్, బషీరాబాద్‌: జిల్లాలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నాయి. పలు గ్రామాల్లో ఊరి చివర ఉండటం, ప్రహరీలు లేకపోవడం అసాంఘిక చర్యలకు వీలు కల్పించినట్లవుతోంది. జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. గతంలో పరిగిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నం.2లో దొంగలు పది కంప్యూటర్లను దొంగిలించారు. రంగంపల్లిలో ఉపాధ్యాయులే తాగిపారేసిన మద్యం సీసాలను ఏరివేయాల్సి వచ్చింది. తాజాగా రెండు రోజుల క్రితం తాండూరు మండల పరిధిలోని ఓ పాఠశాలలో ఆకతాయిలు పాఠశాలకు నిప్పు పెట్టడంతో వేలాది పుస్తకాలు కాలిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి పెద్దగా సమయం లేదు ఇలాంటి పరిస్థితులు ఇకముందు తలెత్తకుండా వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాలోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

వసతి గృహ గదులు శిథిలం

పరిగి సమీపంలోని విద్యారణ్యపురిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ వసతి గృహ గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కిటీకీల ఊచలు, రెక్కలు ఊడిపోయాయి. ప్రహరీ కూడా సరిగా లేకపోవడంతో పోకిరీలకు నిలయంగా మారింది.  

జడ్పీహెచ్‌ఎస్‌ నం.1 పాఠశాలకు భద్రత లేదు. ఇండోర్‌ స్టేడియంకు, పాఠశాలకు మధ్య ఉన్న ప్రహరీ తొలగించడంతో దొంగలు పలుమార్లు తాళాలు విరగ్గొట్టి పాఠశాల మధ్యాహ్న భోజన బియ్యం కూడా అపహరించుకుపోయారు.


సాంకేతిక పరికరాలు మాయం

బషీరాబాద్‌ మండలంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు సెలవు రోజులు, చదువు ముగిసిన తరువాత రాత్రి వేళల్లో భద్రత కరవైంది. ప్రహరీ, గేటు సరిగా లేకపోవడంతో రాత్రి వేళల్లో ఆకతాయిలు అడ్డాగా తయారైంది. బషీరాబాద్‌ బాలుర ఉన్నత పాఠశాలలో తెరబోధన సాంకేతిక పరికరాలను గతంలో చోరీ చేశారు. ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం నామమాత్రమే. 


గేటు ఉన్నా నిరుపయోగం

వికారాబాద్‌ మండల పరిధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ప్రధాన ద్వారానికి గేటు ఉన్నా సరిగ్గాలేదు. అలాగే ఈ పాఠశాలలోని ఓ తరగతి గదికి ఉన్న తలుపు అధ్వానంగా ఉంది. దీంతో తరగతిలో ఉన్న వస్తువులు చోరీకి గురవుతున్నాయి. 


దస్త్రాలు, పుస్తకాలు కాల్చేస్తున్నారు 

తాండూరు మండలం కరణ్‌కోట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, 2 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ద్వారం లేకపోవడం, తరగతి గదులకు తలుపులు లేకపోవడంతో ఆకతాయిలు సాయంత్రం మద్యం సేవించి సీసాలను పగులగొట్టి వేస్తున్నారు. కొందరు పాఠశాలలో విలువైన దస్త్రాలను, పుస్తకాలను చించేస్తున్నారు. గత శనివారం పాఠ్యపుస్తకాలు, బల్లలకు నిప్పు అంటించి తగులబెట్టారు. చెంగోల్‌ ప్రాథమిక పాఠశాల ప్రహరీ అసంపూర్తి ఉండగా ఒకవైపు రంధ్రం చేసి దెబ్బతీశారు. ః సంకిరెడ్డిపల్లి పాఠశాలకు రెండువైపులా ప్రహరీ నిర్మిస్తే ఇటుకల్ని స్థానికులు పెకిలించేశారు. 


ప్రారంభించే నాటికి  పరిష్కరిస్తాం

-రేణుకా దేవి,  డీఈఓ 

వికారాబాద్‌ కలెక్టరేట్‌: పాఠశాలలు ప్రారంభించే నాటికి జిల్లా వ్యాప్తంగా విద్యాలయాల్లో పేరుకున్న వివిధ సమస్యలను పరిష్కరిస్తాం. వివిధ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించాం. ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దటానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రతి చోటా నాణ్యతగా పనులు చేపట్టాలని సూచించాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని