logo

గుర్రపు పందేలపై బెట్టింగ్‌లు.. ఆరుగురి అరెస్ట్‌

గుర్రపు పందేలు కాస్తూ.. బైక్‌లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా బస్సు అద్దాలు పగులగొట్టిన ఘటనల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు.

Published : 21 May 2024 01:45 IST

మహేశ్వరం, కందుకూరు, న్యూస్‌టుడే: గుర్రపు పందేలు కాస్తూ.. బైక్‌లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా బస్సు అద్దాలు పగులగొట్టిన ఘటనల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు. రెండు గుర్రాలు, మూడు బైక్‌లు, రెండు ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాలు ఇలా.. ఫలక్‌నుమాకు చెందిన ముసా కలీం ఉద్దీన్‌తౌసిఫ్, బహుదూర్‌పురాకు చెందిన అసీఫ్‌లు గ్రీన్‌ ఫార్మా సిటీ రోడ్‌లో గుర్రాల రేసింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ఓ వ్యక్తి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో 50 మంది బెట్టింగ్‌లో పాల్గొనడానికి అక్కడికి చేరుకున్నారు. ఈ నెల 16న ఉదయం గ్రీన్‌ ఫార్మా సిటీ రోడ్డులో ఆరు కి.మీ. మేర రోడ్డును ఎంచుకుని రేసింగ్‌ నిర్వహించారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడిపి హారన్‌ మోగిస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా కల్వకుర్తి డిపో బస్‌కు సైడ్‌ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారు. డ్రైవర్‌ హారన్‌ కొట్టడంతో ఆగ్రహించిన సయ్యద్‌ అహ్మద్‌ హస్మీ, మహ్మద్‌ వజాహత్‌ హుస్సేన్‌లు బస్సు అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనలపై మహేశ్వరం, కందుకూరు ఠాణాల్లో కేసులు నమోదు చేశారు. నిందితులు సయ్యద్‌ అహ్మద్‌ హస్మీ, మహ్మద్‌ వజాహత్‌ హుస్సేన్, మూసా కలీంఉద్దీన్‌ తౌసిఫ్, మహమ్మద్‌ ఆసీఫ్, సయ్యద్‌జూనైద్‌అలీ, కాషిప్‌రజీ ఉద్దీన్‌ను అరెస్టు చేసి, ఇద్దరు మైనర్లకు నోటీసులు ఇచ్చి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని