logo

విద్యా ప్రమాణాలు.. ఉపాధికి అవకాశాలు

విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్, అక్రిడేషన్‌ కౌన్సిల్‌)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

Updated : 21 May 2024 05:14 IST

‘న్యాక్‌’ గుర్తింపు కోసం సిద్ధమవుతున్న  ఉస్మానియా వర్సిటీ, సిటీ కళాశాల
ఈనాడు, హైదరాబాద్‌ 

విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్, అక్రిడేషన్‌ కౌన్సిల్‌)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి.   సిటీ కళాశాలకు జూన్‌ వరకూ న్యాక్‌ గుర్తింపు ఉండగా ఓయూకు మరో ఐదు నెలల వరకూ సమయముంది. ఈలోపు రెండు విద్యా సంస్థల అధికారులు న్యాక్‌ బృందం తనిఖీలకు సిద్ధంగా విద్యాలయాలను సన్నద్ధం చేయనున్నారు.  

వందేళ్లకు పైగా విద్యార్థులకు సేవలు 

పీజీ కోర్సుల్లో అత్యుత్తమ విద్యనందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏటా కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. విదేశీ యూనివర్సిటీలకు దీటుగా సిలబస్‌ను తయారు చేయడం, విద్యార్థులను ప్రయోగ పరీక్షలకు సన్నద్ధం చేయడం వంటి విధానాలను ఉపకులపతులు, ఆచార్యులు ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు న్యాక్‌ ఇస్తున్న గుర్తింపుపై రెండేళ్ల క్రితం కొన్ని ఆరోపణలు రాగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్పందించింది. ఇకపై న్యాక్‌ గుర్తింపు మాత్రమే ఇస్తామని, గ్రేడింగ్‌ ఇవ్వబోమని పేర్కొంది. ఈసారి ఏం చేస్తుందనే అంశంపై స్పష్టత రాలేదు. 

ఈ ఏడాది ఐదు కొత్త కోర్సులు..

సిటీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. విద్యా విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ డిగ్రీ, పీజీ విద్యార్థులకు చదువు పూర్తికాగానే ఉద్యోగావకాశాలు లభించేలా అధ్యాపక బృందం కార్యాచరణ రూపొందించింది.  ఈ ఏడాది ఐదు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నామని సిటీ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బాలభాస్కర్‌ తెలిపారు. పర్యాటకం, ఆతిథ్యం, నైపుణ్యాభివృద్ధితోపాటు బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సిస్టమ్, ఇన్సూరెన్స్‌ ప్రోగ్రాం వంటివి ఇందులో ఉన్నాయన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు