logo

వరద కదలక.. దారి వదలక

వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

Updated : 21 May 2024 05:15 IST

వ్యర్థాలతో మ్యాన్‌హోళ్లు మూసుకుపోయి కాలనీల మునక
విధులు బహిష్కరించిన ఐఆర్‌టీ, డీసిల్టింగ్‌ బృందాలు
ఈనాడు, హైదరాబాద్‌

ర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలు మ్యాన్‌హోళ్లను కప్పేస్తుండగా.. నాలాల్లోని పూడిక మట్టి కూడా వరద ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. దానికితోడు..మ్యాన్‌హోళ్లపై వ్యర్థాలను తొలగించి వరదను దారి మళ్లించాల్సిన పూడికతీత బృందాలు, సత్వర మరమ్మతు బృందాలు(ఐఆర్‌టీ) బిల్లులు చెల్లించట్లేదన్న కారణంతో విధులకు దూరంగా ఉండటం ప్రజలకు శాపంగా మారింది. దాంతో.. ఇంజినీరింగ్‌ అధికారులపై విమర్శలొస్తున్నాయి. 

కమిషనర్‌ హెచ్చరించడంతో..

కొన్నేళ్లుగా జీహెచ్‌ఎంసీ ఏడాది పొడవునా నాలాల పూడికతీత, రోడ్లకు మరమ్మతు పనులను చేపడుతోంది. అందుకోసం రెండు రకాల బృందాలను నియమిస్తోంది. నవంబరు 1 నుంచి మే 31 మధ్య ఐఆర్‌టీ బృందాలు పనిచేస్తాయి. డివిజన్‌కు ఒకటి చొప్పున 150 బృందాలు, మరో 10-16 అదనపు బృందాలను ఇంజినీర్లు జోన్లవారీగా నియమిస్తారు. డీసీఎం లేదా టాటా మినీ ట్రాలీ వాహనంలో కంకర, ఇసుక, తారు మిశ్రమం పనిముట్లతో నలుగురు కార్మికులు, ఓ డ్రైవరుతో ఆయా బృందాలు పనిచేయాల్సి ఉంటుంది. వీరు కాకుండా.. ఏడాది పొడవునా పూడికతీత కోసం జోన్లవారీగా బృందాలు పనిచేస్తుంటాయి. అయితే.. ఆయా బృందాలు కాగితాలపై పక్కాగా, క్షేత్రస్థాయిలో మొక్కుబడిగా పనిచేస్తుంటాయి. ఇదేంటని అడిగితే.. ఏడాదికో, ఏడాదిన్నరకో బిల్లులు ఇస్తారని, దాని వల్ల అరకొర సిబ్బందితో పనిచేస్తుంటామని గుత్తేదారులు చెబుతుంటారు. కమీషన్లు, ఇతర వ్యవహారాలతో ఇంజినీర్లు కూడా ఆయా బృందాలను ప్రోత్సహిస్తుంటారు. దీంతో రోడ్లపై గుంతలు అలాగే ఉంటున్నాయి. పూడికతీత జరగట్లేదు. సెంటీ మీటరు వర్షపాతం కురిసినా.. కిలోమీటర్ల మేర రోడ్లపై నీరు నిలుస్తోంది. గుత్తేదారుల సంఘం నిర్ణయంతో ఐఆర్‌టీ బృందాలు ఈనెల 18న పనులను ఆపేశాయి. గత రెండ్రోజులుగా కురిసిన వర్షంతో గచ్చిబౌలి, లింగంపల్లి, బండ్లగూడ, తదితర ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పూడిపోయి.. వరదంతా జనావాసాలను ముంచెత్తింది. ఘటనపై బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఇంజినీర్లపై, జోనల్‌ కమిషనర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి, పనులు ఆపేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమేరకు శేరిలింగంపల్లి జడ్సీ స్నేహ శబరీష్‌ గుత్తేదారుపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.


జూన్‌ 1 నుంచి వర్షాకాల బృందాలు..

ఆర్‌టీ బృందాల కాంట్రాక్టు మే 31తో ముగియనుండగా, జూన్‌ 1 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు వర్షాకాల అత్యవసర బృందాలను రంగంలోకి దించేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచింది. రూ.36.98కోట్లతో 64 సంచార బృందాలు, 104 మినీ అత్యవసర బృందాలు, 160 స్టాటిక్‌ బృందాలతో పని చేయించనున్నట్లు బల్దియా వెల్లడించింది. ఆయా బృందాలు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయని, అలాగే.. ప్రతి చెరువుకు ఓ ఇంజినీరును బాధ్యులుగా నియమించామని ఇంజినీరింగ్‌ విభాగం తెలిపింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని