logo

మాజీ ఉద్యోగుల సొమ్ము స్వాహా

అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను స్వాహా చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 22 May 2024 02:46 IST

అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఉద్యోగి చేతివాటం

ఈనాడు, హైదరాబాద్‌: అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను స్వాహా చేసిన వ్యక్తిని సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. సంస్థలో పనిచేసి రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పేరిట నిధులు పక్కదారి పట్టించిన నిందితుడు ఈ నగదును తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. మోసాన్ని గుర్తించిన అమెజాన్‌ సంస్థ సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ)లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు  సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్, ఏసీపీ హుస్సేని నాయుడు తెలిపారు. 

హోదాను అడ్డుపెట్టుకుని.. సరూర్‌నగర్‌కు చెందిన ఎం.వెంకటేశ్వర్లు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లాలోని అమెజాన్‌ క్యాంపస్‌లో 2015లో ఉద్యోగంలో చేరారు. సీనియర్‌ ఫైనాన్షియల్‌ ఆపరేషనల్‌ అనలిస్ట్‌ హోదాలో అమెజాన్‌ ఇండియా ఉద్యోగుల పేరోల్, సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారి బకాయిల చెల్లింపులకు సంబంధించి సెటిల్‌మెంట్‌ వ్యవహారాలు పర్యవేక్షించేవారు.  ఈ క్రమంలోనే సంస్థను వీడిన మాజీ ఉద్యోగుల్లో కొందరు దీర్ఘకాలంగా తమ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు/క్లెయిము చేసుకోలేదని వెంకటేశ్వర్లు గుర్తించారు.  బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఉద్యోగుల పేర్లతో తనే దరఖాస్తు/క్లెయిము చేయించారు.  

184 మంది పేర్లతో.. నిందితుడు వెంకటేశ్వర్లు 2016- 2023 మధ్య 184 మంది పేర్లతో నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్లించారు. ఈ సొమ్మంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు.  ఇటీవల అమెజాన్‌ అంతర్గత దర్యాప్తు బృందాలు ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించగా కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించాయి. 50 బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బంతా జమైందని, ఇందులో ఒకే పేరుతో ఎక్కువ ఖాతాలు ఉన్నట్లు తేల్చాయి. 184 మంది మాజీ ఉద్యోగులకు సెటిల్‌ చేపినా అదే సంఖ్యలో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవకుండా కేవలం 50 ఖాతాలకే మళ్లడంతో మోసం జరిగినట్లు తేలింది. వెంకటేశ్వర్లు  మాజీ ఉద్యోగుల బకాయిల సెటిల్‌మెంటుకు నకిలీ దరఖాస్తులు చేయించి చెల్లింపులు చేసినట్లు తేలింది. బయటి వ్యక్తులతో కలిసి ఈ సొమ్మంతా పక్కదారి పట్టించారని వెల్లడైంది. ఈ అవకతవకలపై  వెంకటేశ్వర్లును వివరణ కోరే ప్రయత్నం చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని