logo

పూడూరులో ఎన్‌ఐఏ సోదాల కలకలం

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో మంగళవారం జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు జరిపి ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకోవడం జిల్లాలో కలకలం రేపింది.

Published : 22 May 2024 03:05 IST

వికారాబాద్, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో మంగళవారం జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు జరిపి ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని రామేశ్వరం కేఎఫ్‌లో ఈ ఏడాది మార్చి 1వ తేదీన జరిగిన బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిందితులను ఇప్పటికే ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వారిచ్చిన సమాచారంతోనే పూడూరు మండలంలోని ఓ గ్రామంలో సోదాలు నిర్వహించిన ఆ సంస్థ నిందితులతో సంబంధం ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ యువకుడు మండల శివారులో ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. రామేశ్వరం కేఎఫ్‌ పేలుళ్ల నిందితులకు ఈ యువకుడు నిధులు సమకూర్చడంతోపాటు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అదుపులోకి తీసుకున్నది వాస్తవమేనని, వివరాలు తెలియవని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ పోలీసు అధికారి తెలిపారు.

షెల్టర్‌ జోన్‌గా భావించి..

వికారాబాద్‌ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఇదే తొలిసారి కాదు. ఆరేళ్ల కిందట ఎన్‌ఐఏకు పట్టుబడ్డ ఓ ఐసిస్‌ ఉగ్రవాది వికారాబాద్‌ జిల్లాను షెల్టర్‌ జోన్‌గా భావించి అనంతగిరి అటవీ ప్రాంతంలో తుపాకీ పేల్చడంలో వారం రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు తేలడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అనంతగిరిలో భద్రత డొల్లతనాన్ని ఆ ఘటన ఎత్తి చూపినట్లయ్యింది. దీంతో వారాంతపు, ఇతర సెలవు దినాల్లో అనంతగిరి అందాలను తిలకించడానికి వేల సంఖ్యలో వచ్చే పర్యాటకుల భద్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదుగురు పోలీసులతో కూడిన ఓ సంచార గస్తీ బృందం ఇప్పటికీ పహారా కాస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని