logo

కంకర దారిలో.. కష్టాల ప్రయాణం

గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరై సంవత్సరాలు దాటినా పనులు పూర్తి చేయించలేని దుస్థితి నెలకొంది. దెబ్బతిన్న తారు రహదారుల నిర్మాణానికి కంకర పరిచారు. ఏళ్లు గడిచినా..

Published : 22 May 2024 03:10 IST

రోడ్లు సరిగ్గాలేక  నిలిచిన ఆర్టీసీ సర్వీసులు 

వీరారెడ్డిపల్లి దారి రెండు సంవత్సరాలుగా ఇంతే..

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ:  గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరై సంవత్సరాలు దాటినా పనులు పూర్తి చేయించలేని దుస్థితి నెలకొంది. దెబ్బతిన్న తారు రహదారుల నిర్మాణానికి కంకర పరిచారు. ఏళ్లు గడిచినా.. తారు పనులు చేపట్టకుండా వదిలేశారు. వెరసి కంకర దారి మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ దారుల్లో కనీసం ఆర్టీసీ బస్సులు కూడా నడవడం లేదు.    

70 గ్రామాలు.. ఇదీ పరిస్థితి  తాండూరు నియోజకవర్గంలో 143 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా మరో 70 గ్రామాలు కొనసాగుతున్నాయి. ప్రతి పల్లెకు తారు రహదారి నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలో గతేడాది తాండూరు మండలంలో జాతీయ రహదారి నుంచి వీరారెడ్డిపల్లి రహదారి నిర్మాణానికి రూ.72లక్షలు, జాతీయ రహదారి నుంచి సిరిగిరిపేటకు రూ.85లక్షలు మంజూరు చేసింది. దీంతో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు దెబ్బతిన్న సిరిగిరిపేట రహదారిపై తారును జేసీబీ యంత్రాలతో తొలగించారు. అనంతరం నేల చదును చేసి కంకర పరిచారు. ఎనిమిది నెలలు గడిచినా తారు పనులు చేపట్టడం లేదు. దీంతో ప్రతిరోజూ కంకర మీదుగా ప్రయాణిస్తున్న గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ఉన్న తారు తొలగించి కంకర కుమ్మరించి మరిన్ని కష్టాలు తెచ్చారంటూ... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరారెడ్డిపల్లి మార్గంలోనూ రెండు కిలోమీటర్ల పొడవునా కంకరతో గ్రామస్థులు యాతన పడుతున్నారు. పలువురు ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలై ఆస్పత్రి పాలయ్యారు.వెంటనే రోడ్డు వేయాలని కోరుతున్నారు. 

ఎనిమిది నెలలుగా గోనూరు మార్గంలో.. 

నెరవేరని తారు కల.. 

వీరారెడ్డిపల్లి మార్గం నుంచి రాంపూర్‌తండా వరకు తొలిసారి తారు రహదారి నిర్మించేందుకు రూ.90లక్షలు మంజూరయ్యాయి. వీటితో 2018-19 సంవత్సరంలో గుత్తేదారు దారిపొడవునా కంకర పరిచారు. ఐదు సంవత్సరాలు గడిచినా తారు పనుల జాడలేదు. కంకర వేయడంతో తండా తారు రహదారి సమకూరుతుందని స్థానికులు సంబురపడ్డారు. ఐదేళ్లుగా పనుల ఊసే లేకపోవడంతో తండావాసుల కల నీరుగారింది. ఇక్కడ బస్సులు తిరగలేని దుస్థితి. గోనూరు, నారాయణ్‌పూర్‌ మార్గంలో యాలాల మండలం లక్ష్మీనారాయణ్‌పూర్, అగ్గనూర్‌ వద్ద దెబ్బతిన్న రహదారి నిర్మించేందుకు కంకర పరిచారు. ఎనిమిది నెలలు గడిచినా.. తారు పనులు మొదలు పెట్టడం లేదు. వారం రోజుల్లో పూర్తయ్యే పనికి నెలల తరబడి జాప్యం చేయడాన్ని నిరసిస్తూ గతనెలలో అగ్గనూరు గ్రామస్థులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు రహదారి నిర్మించక పోవడంతో కంకర మీదుగా రాకపోకలు సాగిస్తూ దుమ్ము కాలుష్యంతో వేలాది మంది వాహనదారులు, ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని