logo

గాబరా పెడుతూ.. నాసివి అంటగడుతూ..

తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే కొందరు విత్తన వ్యాపారులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నారు. పత్తి విత్తనాల కోసం రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కృత్రిమ కొరతకు తెర తీస్తున్నారు.

Published : 22 May 2024 03:15 IST

పత్తి రైతుకు పొంచి ఉన్న ముప్పు
ఖరీఫ్‌కు ముందే మార్కెట్లో  కృత్రిమ కొరత

పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు (పాత చిత్రం)

నూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌:  తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే కొందరు విత్తన వ్యాపారులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నారు. పత్తి విత్తనాల కోసం రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కృత్రిమ కొరతకు తెర తీస్తున్నారు. పేరెన్నిక గల కంపెనీల విత్తనాలు దొరకడం లేదని ముందుగానే కొని దగ్గరుంచుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అమాయక రైతులు విత్తనం నాసి రకమా, నాణ్యత కలిగిందా అనే విషయం కూడా గమనించలేక కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ‘న్యూస్‌టుడే’ కథనం.

మద్దతు ధర కలిసి వస్తుందని ఆశ  

నాలుగేళ్ల అనుభవాల దృష్ట్యా ఈ వానాకాలం సీజన్‌లో అత్యధికంగా పత్తి పంట వేయడం వైపే జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి క్వింటాలు ప్రభుత్వ మద్దతు ధర రూ.6,080 ఉండటం, బహిరంగ విపణిలో ధర రూ.6,500 పైచిలుకు పలకడంతో అధిక శాతం రైతులు పత్తి సాగుకు ఆసక్తి  కనబరుస్తున్నారు. 2022లో జిల్లాలో దిగుబడి తగ్గినా గరిష్ఠంగా పత్తి క్వింటాలుకు రూ.9,500 అమ్ముడుపోయింది.

పొంచిఉన్న బీటీ -3 బెడద

రైతుకు కావాల్సినవి లభించకపోవడంతో బీటీ -3 విత్తనాల బెడద పొంచి ఉంది. కలుపు పెద్దగా ఉండదని పురుగు మందుల ఖర్చులు తగ్గుతాయని ప్రచారం చేయడంతో గతేడాది కర్నూలు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా వివిధ గ్రామాలకు పంపిణీ అయ్యాయి. 


అసలు రూ.864.. విక్రయం.. రూ.2,000

జిలాలలో ఒక్కో ప్యాకెట్‌ పత్తి విత్తన ధర వాస్తవానికి రూ.864 ఉండగా రూ.1500 నుంచి రెండువేలకు పైగా విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్‌ డివిజన్ల పరిధిలో 523 మందికి విత్తన లైసెన్సులు ఉన్నాయి. 

పట్టుకుంటున్నా కనిపించని మార్పు

అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్మడం, కొన్నిచోట్ల నాసిరకం విక్రయించడంతో అధికారులు తనిఖీల్లో ప్రతిసారీ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖకు దౌల్తాబాద్, కొడంగల్‌్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ ప్రాంతాల్లో పట్టుబడిన నాసిరకం విత్తన ఉదంతాలే ఇందుకు తాజా ఉదాహరణ. సుమారు రూ.36లక్షల విలువ చేస్తే  రూ.23క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నా మార్పు రావడంలేదు.  

  • కొన్ని కంపెనీలకు చెందిన విత్తనాల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పల్లెల్లో ఇది జోరుగా సాగుతోంది.

అనుమతులు రద్దు చేస్తాం 
-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి. 

గతంలో కంటే ఈసారి అధిక విస్తీర్ణంలో పత్తి, కంది పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే వ్యాపారుల లైసెన్సును రద్దు చేస్తాం. ప్రస్తుతం 1.10లక్షల విత్తనాలు అందుబాటులో ఉంచాం. జిల్లాలోని నాలుగు డివిజన్లలో డివిజన్‌కు ఒకటి చొప్పున ఇంటర్నల్‌ స్క్వాడ్‌ బృందాలు కూడా పనిచేస్తున్నాయి. రైతులు సైతం మెలకువతో మెలగాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని