logo

ఇళ్ల దరఖాస్తుల తిరస్కరణపై గ్రేటర్‌ కమిషనర్‌ ఆగ్రహం

నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తూ.. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 22 May 2024 03:20 IST

సమీక్షలో కమిషనర్‌ రోనాల్డ్‌రాస్, సీపీపీ రాజేంద్రప్రసాద్‌నాయక్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తూ.. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్‌ఫాల్స్, ఇతరత్రా కారణాలతో అనవసరంగా దరఖాస్తులను తిరస్కరించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. టౌన్‌ప్లానింగ్‌ పనితీరుపై మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర ముఖ్య ప్రణాళికాధికారి(సీసీపీ) రాజేంద్రప్రసాద్‌నాయక్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ..‘‘పరిశీలనలోని దరఖాస్తులను, నివాసయోగ్యపత్రాల కోసం వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం ఆమోదించండి. గడిచిన నాలుగైదు నెలల్లో షార్ట్‌ఫాల్స్, ఇతరత్రా కారణాలతో తిరస్కరించిన దరఖాస్తుల వివరాలివ్వండి. టీజీబీపాస్‌ నిబంధనలను అధికారులు తప్పక పాటించాలి. దరఖాస్తులను రోజులు, నెలల తరబడి తొక్కిపెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు.’’అని అధికారులకు స్పష్టం చేశారు. సర్కిళ్లవారీగా ఏసీపీలు, సీపీల వద్ద రోజుల తరబడి నిలిచిపోయిన దరఖాస్తుల వివరాలను, అధికారుల వారీగా తిరస్కరణకు గురైన దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్వర రిజిస్ట్రేషన్, సత్వర ఆమోదం కింద వచ్చే అర్జీలపై జాప్యం ఉండొద్దన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పక్కాగా జరగాలని సూచించారు. శిథిల భవనాల గుర్తింపును వేగవంతం చేయాలని, ప్రతి గల్లీని సందర్శించి పాత నిర్మాణాల లెక్క తేల్చాలన్నారు. వర్షాకాలంలో భవనాలు కూలిపోయి ప్రాణ నష్టం చోటు చేసుకునే ఘటనలు తలెత్తవద్దని గుర్తుచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని