logo

అనుభవజ్ఞులకు చోటు

రాజధానిలోని 5 విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జులుగా అనుభవజ్ఞులైన ఐఏఎస్‌ అధికారులు ఎం.దానకిషోర్, బుర్రా వెంకటేశం, డాక్టర్‌ శైలజా రామయ్యర్, ఎస్‌.ఎ.ఎం.రిజ్వీ, జయేష్‌ రంజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది.

Updated : 22 May 2024 04:04 IST

5 వర్సిటీలకు ఐఏఎస్‌ల నియామకం 

ఈనాడు,  హైదరాబాద్‌: రాజధానిలోని 5 విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జులుగా అనుభవజ్ఞులైన ఐఏఎస్‌ అధికారులు ఎం.దానకిషోర్, బుర్రా వెంకటేశం, డాక్టర్‌ శైలజా రామయ్యర్, ఎస్‌.ఎ.ఎం.రిజ్వీ, జయేష్‌ రంజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. వీరు ఉస్మానియా, జేఎన్‌టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్‌ విశ్వవిద్యాలయాల పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. రోజువారీ అంశాలతో పాటు ఆయా వర్సిటీల్లో కీలమైన విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, రోజువారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాధికారం వీరికే ఉండనుంది.

అవగాహన.. సమస్యల పరిష్కారం : ఈ ఐఏఎస్‌ అధికారులకు విశ్వవిద్యాలయాల్లోని పరిపాలనా అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంది. అక్కడున్న సమస్యలను వీరు త్వరితగతిన పరిష్కరించనున్నారు. 

  • జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి వీసీగా నియమితులైన బుర్రా వెంకటేశం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిపాలనా సంబంధ వ్యవహారాలపై ఆయనకు అవగాహన ఉంది.
  • ఓయూ ఇన్‌ఛార్జి వీసీ ఎం.దానకిశోర్‌ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఉస్మానియాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వచ్చేందుకు అవకాశాలున్నాయి. 
  • అంబేడ్కర్‌ వర్సిటీ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్న ఎస్‌.ఎ.ఎం. రిజ్వి ప్రస్తుతం ఇంధన శాఖ  ముఖ్య కార్యదర్శి. విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త ప్రాజెక్టుల పురోగతిపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలున్నాయి. పదో షెడ్యూలు జాబితాలో ఈ విశ్వవిద్యాలయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఆచార్యులు, ఉద్యోగుల ఐచ్ఛికాలు, కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల అంశాలపై విధివిధానాలను పరిశీలించే అవకాశాలున్నాయి.
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వ్యవహరించనున్న శైలజా రామయ్యర్‌.. ఆ విశ్వవిద్యాలయం ప్రారంభించిన కొత్తకోర్సులు, ఉపాధి అవకాశాల కోసం ప్రవేశపెట్టనున్న సర్టిఫికెట్‌ కోర్సులపై తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలున్నాయి.
  • జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం పరిపాలనా వ్యవహారాలను, రోజువారీ కార్యకలాపాలను పరిశీలించనున్న జయేష్‌ రంజన్‌.. పరిశోధనలు, కొత్త కోర్సులకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిర్ణయాలను వేగంగా తీసుకునే అవకాశాలున్నాయి. దీంతోపాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలపై సమీక్షించేందుకు వీలుంది.   
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని