logo

వానాకాలం సన్నద్ధత షురూ

సాధారణంగా మే నెలలో ఎండలు మండుతుంటాయి.. రెప్పపాటు కాలం కరెంట్‌ పోయినా చెమటలు కక్కాల్సిందే.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో  ప్రస్తుతం వాతావరణం సాధారణంగానే ఉంది.

Updated : 22 May 2024 04:06 IST

కోతలు కావవి.. నిర్వహణ మరమ్మతులంటున్న డిస్కం

33కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతులు చేస్తున్న సిబ్బంది 

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా మే నెలలో ఎండలు మండుతుంటాయి.. రెప్పపాటు కాలం కరెంట్‌ పోయినా చెమటలు కక్కాల్సిందే.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో  ప్రస్తుతం వాతావరణం సాధారణంగానే ఉంది. దీంతో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీ ఎస్పీడీసీఎల్‌) వానాకాలం సన్నద్ధత కోసం నిర్వహణ పనులు మొదలెట్టింది. అత్యవసర పనులకు అరగంట, నిర్వహణ పనుల కోసం రెండేసి గంటలు సరఫరా నిలుపుతున్నారు. ఇవేం కోతలు బాబోయ్‌ అంటూ రాజకీయ విమర్శలు, సామాజిక వేదికల్లో ప్రచారం జరుగుతుండటంతో డిస్కం వివరణ ఇచ్చింది. కోతలు కావని నిర్వహణ మరమ్మతులని తెలిపింది. 

ఎండాకాలంలో కురిసిన ఆకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. చెట్లు విరిగి పడటం, కొమ్మలు తీగలపై పడటంతో సమస్యలు తలెత్తాయి. చెట్లు కూలితే వచ్చే సమస్యలు మినహాయించి మిగిలిన వాటిలో ముందస్తు నిర్వహణ ద్వారా ఎక్కువ అంతరాయాలు లేకుండా చూసుకోవచ్చు. అందుకు విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో 33/11కేవీ ఉపకేంద్రాలు, విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ నిరంతరం చేస్తేనే సాధ్యం. డిస్కం ఏటా రెండుసార్లు ఈ పనులను చేపడుతోంది. 

చెట్ల కొమ్మలు  కొట్టడమేనా? 

నిర్వహణ పనులంటే చెట్ల కొమ్మలు కొట్టడమే అనే విమర్శలు డిస్కంపైన ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చాలావరకు జరిగేది ఇదే. ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు, జంపర్లు, జాయింట్స్‌ తనిఖీ చేయడం, వదులుగా ఉన్న తీగలను సరిచేయడం, తీగలపై పడిన దారాలు, బ్యానర్లు, వస్తువుల తొలగింపు, ట్రాన్స్‌ఫార్మర్ల ఎర్తింగ్, సర్క్యూట్‌ బ్రేకర్లు, రిలేల పనితీరు వరకు తనిఖీ చేయాలి.  గతంలో మాదిరి ఇప్పుడు పరిస్థితులు లేవని పక్కాగా చేస్తున్నామని ఇంజినీర్లు అంటున్నారు. 


ముందస్తు అనుమతితో...

వాతావరణ పరిస్థితులను బట్టి  ముందుగానే క్షేత్రస్థాయి ఇంజినీర్లు అనుమతి తీసుకుని పనులకు షెడ్యూల్‌ చేసుకుంటున్నారు. ఈ సమాచారం ఇప్పటికీ వినియోగదారులకు పూర్తిస్థాయిలో చేరడం లేదు. వందశాతం మొబైల్‌ నంబర్లను డిస్కం ఇటీవల సేకరించినా అంతరాయాల ముందస్తు సమాచారం వినియోగదారులకు చేరడంలేదు. దీంతో కరెంట్‌ గంటల తరబడి పోవడంతో కోతలుగా ప్రచారం జరుగుతోంది. వీటిని నమ్మవద్దని డిస్కం కోరుతోంది.నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం వినియోగదారుడికి చేరితే ఇలాంటి అపోహలకు తావుండదనే సూచనలు వినియోగదారుల నుంచి డిస్కంకు అందుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు