logo

వర్షపు నీటినీ తాగొచ్చు

నగరంలో కురుస్తున్న వాన నీటిలో కొంతైనా భూమిలోకి ఇంకించినా.. ఫిల్టర్‌ చేసి వాడుకున్నా.. నగరవాసులకు నీటి కష్టాలే ఉండవు. నగరంలో సరాసరి వర్షపాతం 850 మిల్లీమీటర్లు. హెచ్‌ఎండీఏ పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు ఏటా కురుస్తున్న వాన నీళ్లు 15 టీఎంసీలకు సమానమని నిపుణులు చెబుతున్నారు.

Updated : 22 May 2024 05:41 IST

వెయ్యి చ.మీ.లో 85 వేల లీటర్లు ఆదా

స్లాబ్‌పై నుంచి వచ్చే వాన నీటి గొట్టానికి అమర్చిన ఫిల్టర్, సంపులో పడుతున్న నీరు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో కురుస్తున్న వాన నీటిలో కొంతైనా భూమిలోకి ఇంకించినా.. ఫిల్టర్‌ చేసి వాడుకున్నా.. నగరవాసులకు నీటి కష్టాలే ఉండవు. నగరంలో సరాసరి వర్షపాతం 850 మిల్లీమీటర్లు. హెచ్‌ఎండీఏ పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు ఏటా కురుస్తున్న వాన నీళ్లు 15 టీఎంసీలకు సమానమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 5శాతం కూడా భూమిలోకి ఇంకించడం, అవసరాలకు వాడుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఆలోచన ఉండాలనే కానీ.. ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పట్టవచ్చు. భూమిలోకి ఇంకించడమే కాకుండా.. ఫిల్టర్‌ చేసి వంటకు, తాగడానికీ వాడుకోవచ్చు. వాక్‌ ఫర్‌ వాటర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.కరుణాకర్‌రెడ్డి కర్మన్‌ఘాట్‌లోని తన కార్యాలయంలో ఈ విధానాన్ని అమలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నగరంలో చాలామంది ఇలానే వాననీటితో లబ్ధిపొందుతున్నారని తెలిపారు. 

అతి తక్కువ ఖర్చుతోనే..

ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటి సంరక్షణకు అతి తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లపై పడే వర్షపు నీటిని కిందికి పంపే పైపులకు సంపు ప్రాంతంలో చిన్న ఫిల్టర్‌ పెట్టి సంపులోకి మళ్లించాలి. ఫిల్టర్‌ ఖరీదు రూ.3 వేలతోపాటు ప్లంబర్‌ ఖర్చులు మాత్రమే చెల్లించాలి. వాన నీళ్లు అత్యంత స్వచ్ఛమైనవి. డాబాపై పడిన తర్వాత అందులోకి వ్యర్థాలు చేరుతాయి. వాటిని ఫిల్టర్‌ వడబోసి.. స్వచ్ఛమైన నీటిని సంపులోకి పంపుతుంది. తర్వాత సంపులో ఒకటి, రెండు క్లోరిన్‌ మాత్రలు కలిపి ఇంట్లో తాగడానికి, వంటకు ఉపయోగించవచ్చునని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తొలుత 5 నిమిషాలు వర్షపు నీటిని సంపులోకి కాకుండా బయటకు విడిచి పెట్టడంతో ఏదైనా చెత్త ఉంటే పూర్తిగా పోతుంది. తర్వాత సంపులోకి మళ్లించాలి.


భారీగా వాన నీటి ఆదా..

ఏటా నగరంలో 850 మిల్లీమీటర్ల వరకు వాన కురుస్తుంది. ఈ లెక్కన ఒక చదరపు మీటరు స్థలంలో ఏటా 850లీటర్ల వర్షపు నీరు చేరుతుంది. అదే వెయ్యి చదరపు మీటర్ల ఇంటి పైకప్పుపై ఏటా 85వేల లీటర్ల వరకు వాన నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మణికొండ, నానన్‌రాంగూడ, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో 33 వేల బోర్లు ఎండిపోయినట్లు జలమండలి గుర్తించింది. ఇందులో సగం ఇళ్లల్లో వర్షపు నీటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోలేదని గుర్తించింది. 


ఏడాదంతా బోర్లు ఎండకుండా..
- ఎం.కరుణాకర్‌రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు, వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ

ఈ విధానంతో ఇళ్లు, కాలనీల్లో వర్షపు నీటిని ఆదా చేయచ్చు. పార్కులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని వాటిలోకి మళ్లించడం ద్వారా బోర్లు ఇంకే పరిస్థితి ఉండదు. బోరుకు కొంత దూరంలో ఇంజక్షన్‌వెల్‌ తవ్వి అందులోకి ఈ విధానంలో వర్షపు నీటిని మళ్లించడం ద్వారా ఏడాది అంతా బోర్లు ఇంకిపోవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని