logo

విద్యార్థుల సృజనకు సరికొత్త వేదిక

సరికొత్త ఆలోచనలు... విభిన్న కోణాల్లో సమాజ స్థితిగతులపై అధ్యయనం... అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో లఘు చిత్రాలు రూపొందించనున్న విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రోత్సాహం ఇవ్వనుంది.

Updated : 22 May 2024 05:42 IST

విభిన్న లఘుచిత్రాల రూపకల్పనకు ఉస్మానియా ఫిల్మ్‌ క్లబ్‌

అప్పటి వీసీ రవీందర్‌తో చర్చిస్తున్న క్లబ్‌ నిర్వాహకులు

ఈనాడు, హైదరాబాద్‌: సరికొత్త ఆలోచనలు... విభిన్న కోణాల్లో సమాజ స్థితిగతులపై అధ్యయనం... అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో లఘు చిత్రాలు రూపొందించనున్న విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రోత్సాహం ఇవ్వనుంది. సృజనాత్మకంగా ఆలోచించే విద్యార్థుల కోసం ఉస్మానియా ఫిల్మ్‌క్లబ్‌ పేరుతో ఒక వేదికను ప్రారంభించింది. లఘు చిత్రాలకు దర్శకులు, నిర్మాతలుగా మారే విద్యార్థులను గుర్తించి వారితో భిన్నమైన అంశాలు, సమకాలీన సమాజ పరిస్థితులు, ఇప్పటికీ కొనసాగుతున్న దురాచారాల వంటివాటిపై లఘుచిత్రాలను చిత్రీకరించనుంది. విద్యార్థులు నిర్మించిన చిత్రాలను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపుతారు.  సినీరంగ ప్రముఖులతో అవగాహన..   ఉస్మానియా విశ్వవిద్యాలయం ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు, ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు అంతర్‌విశ్వవిద్యాలయాల స్థాయిలో లఘుచిత్రాల ప్రదర్శనను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు, దర్శకులు, నిర్మాతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇక్కడి సినీదర్శకులు శేఖర్‌ కమ్ముల వంటివారిని ఆహ్వానించి లఘు చిత్రాల రూపకల్పనలో ఎలాంటి అంశాలు ఎంచుకోవాలి?  యువతను ఆకట్టుకోవాలంటే కథనం, సంవిధానం ఎలా ఉండాలన్న అంశాలపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు పరిశోధక విద్యార్థులు  లఘుచిత్రాలను రూపొందించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపాదించారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఫిల్మ్‌క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు అప్పటి వీసీ నిర్ణయం తీసుకున్నారు. 


సామాజిక ఇతివృత్తాలకు ప్రాధాన్యం

ఫిల్మ్‌క్లబ్‌ ద్వారా సామాజిక ఇతివృత్తాలకు సంబంధించిన లఘుచిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన స్థితిగతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరు, విదేశాల్లో విద్యాప్రమాణాలు, మనదేశంలో విద్యాప్రమాణాలను పోలుస్తూ చిత్రాలను రూపొందించేందుకు సరైన అవగాహన కలిగిన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వీరితో చిత్రాలు నిర్మిస్తూనే... మరింత మందికి అవకాశాలు కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో విద్య లేకున్నా... దైనందిన జీవితంలోని అనుభవాలతో కొత్త వస్తువులు, పరికరాలను తయారుచేసిన వారిని గుర్తించి వారి విజయగాథలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుకుంటూ వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న విద్యార్థుల కృషిని ప్రపంచానికి ప్రదర్శించనున్నారు. చలనచిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సాయంతో లఘు చిత్రాలను విభిన్నంగా రూపొందించనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు