logo

ఏసీపీ ఉమామహేశ్వరరావు.. ఆయన తీరెప్పుడూ వివాదాస్పదమే

ఎస్సై.. ఇన్‌స్పెక్టర్‌.. ఏసీపీ.. ఎక్కడ పనిచేసినా ఆయన తీరెప్పుడూ వివాదాస్పదమే. కింది స్థాయి సిబ్బందిని వేధించి సస్పెండ్‌ అయ్యారు. ఓ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునే క్రమంలో ఆమె కూర్చున్న మంచంపై దర్జాగా కాలుపెట్టి క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు.

Updated : 22 May 2024 05:56 IST

ఓసారి ఫిర్యాదుదారుతో అనుచిత ప్రవర్తన.. బదిలీ వేటు.. ఇప్పుడు ఏసీబీ వలలో

అప్పట్లో మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుంటూ వివాదాస్పదమైన ఛాయాచిత్రం

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై.. ఇన్‌స్పెక్టర్‌.. ఏసీపీ.. ఎక్కడ పనిచేసినా ఆయన తీరెప్పుడూ వివాదాస్పదమే. కింది స్థాయి సిబ్బందిని వేధించి సస్పెండ్‌ అయ్యారు. ఓ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునే క్రమంలో ఆమె కూర్చున్న మంచంపై దర్జాగా కాలుపెట్టి క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. పోలీసు శాఖలో తరచూ వివాదాల్లో నిలిచే ఆయన ఇప్పుడు ఏసీబీకి దొరికిపోయారు. ఆయనే నగర సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు. 

మంచంపై కాలుపెట్టి

జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2017 డిసెంబరులో ఓ వ్యక్తి హత్య జరిగింది. అప్పటి జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఉమామహేశ్వరరావు హతుడి భార్య నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నేరుగా వారి ఇంటికెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు రాసే సమయంలో ఆమె కూర్చున్న మంచంపైనే ఉమామహేశ్వరరావు దర్జాగా బూటు కాలు పెట్టారు. ఈ ఫోటో చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత బదిలీ వేటు వేశారు. 

మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు

అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించి సస్పెన్షన్‌కు గురయ్యారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నట్లు బాధితులు అప్పటి సీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.  

భూ తగాదాల్లో చేతివాటం..!

భూ వివాదాల్లో తలదూరుస్తూ చేతివాటం ప్రదర్శిస్తుంటారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినప్పుడు ఓ భూ వివాదంలో తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఓ ప్రవాసుడి రూ.80 కోట్ల భూమిని కొందరు కబ్జా చేశారని, భూ యజమాని అడుగుపెట్టకుండా రూ.లక్షల్లో డీల్‌ కుదుర్చుకున్నారని ఆరోపణలొచ్చాయి. దీనిపై అప్పటి సీపీ డీఎస్‌ చౌహాన్‌ విచారణ చేయించారు. ఇబ్రహీంపట్నంలో ఓ వ్యక్తికి చెందిన ఎకరన్నర భూమిని కొందరు కబ్జా చేశారు. బాధితుడు తన భూమిని ఇప్పించాలని పోలీసుల్ని ఆశ్రయించగా భారీగా డిమాండ్‌ చేశారని సమాచారం. దీనిపై బాధితుడు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని