logo

జూలో జత కలిసే

హైదరాబాద్‌ నగరంలోని నెహ్రూ జూపార్కులోని పెద్దపులులు నాలుగేళ్ల తర్వాత జత కలిశాయి. కేటాయించిన స్థలంతో పోలిస్తే వాటి సంతతి ఎక్కువ అవడంతో కేంద్ర జూ అథారిటీ(సీజెడ్‌ఏ) అప్పట్లో ఆంక్షలు విధించింది.

Updated : 22 May 2024 05:39 IST

నాలుగేళ్ల తర్వాత సింహాలు, పులులకు తోడు 
త్వరలో ఒంటరి జీవులకూ..
ఈనాడు, హైదరాబాద్, చార్మినార్, న్యూస్‌టుడే

హైదరాబాద్‌ నగరంలోని నెహ్రూ జూపార్కులోని పెద్దపులులు నాలుగేళ్ల తర్వాత జత కలిశాయి. కేటాయించిన స్థలంతో పోలిస్తే వాటి సంతతి ఎక్కువ అవడంతో కేంద్ర జూ అథారిటీ(సీజెడ్‌ఏ) అప్పట్లో ఆంక్షలు విధించింది. కొన్నాళ్లపాటు వాటిని సంపర్కానికి దూరంగా ఉంచాలని సూచించడంతో.. జూ అధికారులు ఆడ, మగ జీవాలను వేర్వేరుగా ఉంచారు. ఈ క్రమంలో కొన్ని చనిపోవడం, కొన్నింటిని ఇతర జూలకు పంపించడంతో కొత్త సంతానానికి అనుకూల పరిస్థితులొచ్చాయి. దీంతో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న పలు జంతువులు, పక్షులకు తోడు తీసుకొచ్చే ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. 
 2 నెలల్లో పులి కూనలు: జూ పార్కులో ప్రస్తుతం 18 రాయల్‌ బెంగాల్‌ పెద్దపులులున్నాయి. వాటిలో తెల్ల పెద్దపులులు కూడా ఉన్నాయి. 4 నెలల క్రితం సంతతి వృద్ధిపై ఆంక్షలను ఎత్తేయగా 2 పులులు ఇటీవల గర్భం దాల్చాయి. 2 మాసాల్లో పులికూనలు రానున్నాయి.

నిశాచర జీవులకు: 40 ఏళ్ల క్రితం నిశాచర జీవుల సంరక్షణ కేంద్రం నిర్మాణమైంది. అప్పటి ప్రమాణాల ప్రకారం.. సూర్యకాంతి ప్రసరించకుండా భవనాన్ని నిర్మించారు. దానివల్ల గుడ్లగూబలు, ముళ్లపందులు, పిల్లుల జాతి జంతువులకు సంతతి లేకుండా పోయింది. అనంతరం కొత్త సాంకేతికతలు వచ్చాయి. దీంతో ఆధునిక భవనాన్ని నిర్మించాల్సి ఉంది. అప్పటివరకు ప్రస్తుత సంరక్షణ కేంద్రంలోనే సౌకర్యాలను మెరుగుపరచాలి.

మూగజీవుల మార్పిడి ద్వారా..

జూలో 18 పులులు, 19 సింహాలు ఉన్నాయి. మెజార్టీ ఒకే కుటుంబానికి చెందినవి. అందువల్ల పుట్టే పిల్లలు బలహీనంగా ఉండటం, జబ్బులు, జన్యుపరమైన సమస్యలు ఉత్పన్నం కావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు గతంలో మాదిరి.. త్వరలో హరియాణాలోని రోటక్‌ జూ నుంచి రెండు జంటల పెద్దపులులను తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గుజరాత్‌లోని జునాగఢ్‌ జూ నుంచి ఒక జంట సింహలను తెప్పించాలని నిర్ణయించారు. కోల్‌కతా నుంచి ఆడ జిరాఫీని, కాన్పూర్‌ నుంచి నీల్‌గాయ్, సాంబార్, వైట్‌బక్, బ్లాక్‌ బక్‌ తదితర మూగ జీవాలను కొన్నినెలల్లో నగర జూపార్కుకు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. జీబ్రా, అడవి కుక్కలను తీసుకొచ్చేందుకు దేశీయ, అంతర్జాతీయ జూపార్కులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

తోడు తీసుకొచ్చి..

ఆడ ఫిష్‌ క్యాట్, ఆడవి రాస్టస్‌ స్పాటెడ్‌ క్యాట్, స్క్వారెల్‌ మంకీ, సెక్రిట్‌ బాబూన్, సిల్వర్‌ కస్టేడ్‌ కాకటూల్స్, జిరాఫీ, కొండగొర్రెలు, పలు రకాల మకావ్‌ పక్షుల వంటి 23 జాతుల జీవులు జూ పార్కులో కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాయి. తోడు లేకపోవడంతో వాటి మానసిక పరిస్థితి సరిగా ఉండట్లేదు. తోడును తీసుకొచ్చి వాటిని జత కట్టించాలనే ఉద్దేశంతో మైసూర్‌లోని శ్రీచామ రాజేంద్ర జూపార్కు, చెన్నై, హరియాణా, గుజరాత్‌ తదితర జూలతో నెహ్రూ జూ పార్కు అధికారులు సంప్రదింపులు జరిపారు.


రక్త మార్పిడితో బలమైన సంతతి
డా.సునీల్‌ ఎస్‌.హిరేమత్, క్యూరేటర్‌ 

సందర్శకులకు జంతు విజ్ఞానం, వినోదాన్ని అందించడంతోపాటు వన్యప్రాణి సంరక్షణ మా ధ్యేయం. జూపార్కులోని మూగజీవుల సంతతి బలంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. రక్తమార్పిడి కార్యక్రమంతో పులులు, సింహాల సంతతి బలంగా ఉంటుంది. ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోన్న జంతు, పక్షి జాతులకు తోడు తీసుకురాబోతున్నాం. నిశాచర జీవుల జీవనాన్ని మెరుగుపరిచే చర్యలు ప్రారంభం కానున్నాయి. వాటికి బలమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. ఏడాదికి తాగునీటి కోసం జలమండలికి రూ.కోటికిపైగా చెల్లిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని