logo

ఔటర్‌ చుట్టూ.. ఔరా అనిపించేలా

రాష్ట్రంలో కొత్తగా ఐటీ సంస్థలు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఔటర్‌ చుట్టూ వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు చేస్తున్నారు.

Updated : 22 May 2024 07:06 IST

ఐటీ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఐటీ సంస్థలు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఔటర్‌ చుట్టూ వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారుల కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఔటర్‌కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. కృత్రిమమేధపై పరిశోధనలు పెంచేందుకు 200 ఎకరాల్లో ఏఐసీటీ, నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాటన్నింటికీ అవసరమైన ప్రభుత్వ భూములను సేకరించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలో ఏవైనా సంస్థలు, పరిశ్రమలకు స్థలాలు ఇచ్చి అవి ఇంకా కార్యకలాపాలు ప్రారంభించకపోతే వాటిని వెనక్కి తీసుకునేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లనున్నారు.


అన్నింటికీ అనుకూలంగా ఉండేలా... 

ప్రభుత్వం కేటాయించే భూములు అన్నింటికీ అనుకూలంగా ఉండేలా రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధుల్లో స్థలాలను పరిశీలించారు. ఒక్కోచోట వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా సేకరించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీంతోపాటు ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) తరహాలో ఒకేచోట 300 ఎకరాల భూములు సేకరించాలని, పరిశ్రమలు, ఐటీ సంస్థలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేస్తే అక్కడ నివాసం ఉండేందుకు వీలుంటుందని రెవెన్యూ అధికారుల భావిస్తున్నారు. ఇందుకోసం 300 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించాలని నిర్ణయించారు. మిషన్‌ భగీరథ, జలమండలి అధికారులతో చర్చించి ఇళ్లు, ఆపార్ట్‌మెంట్ల నిర్మాణం ప్రారంభమైనప్పుడే తాగునీరు, మురుగు నీటి వ్యవస్థను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేయనున్నారు.


 ఫాక్స్‌కాన్‌... టెక్స్‌టైల్స్‌  హబ్‌ తరహాలో

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి సమీపంలో ఫాక్స్‌కాన్‌ సంస్థ ఆపిల్‌ ఫోన్‌ విడిభాగాల తయారీ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది. మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎలక్ట్రానిక్‌ సిటీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈరెండు పరిశ్రమలతో పాటు షాబాద్‌ మండలంలో విద్యుత్‌ బస్సుల తయారీ, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ, పరిశ్రమల హబ్‌లో పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు వాటికి సమీపంలో విద్యా సంస్థలు, వినోద కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, రెస్టారెంట్లను ప్రారంభిస్తే నాలుగైదేళ్లలోనే అక్కడ కూడా అభివృద్ధి పెరిగి మహానగరం తరహాలో అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని