logo

పనులిలా.. ఏమనాలా?

వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి

Updated : 23 May 2024 04:53 IST

ఎస్‌ఎన్‌డీపీ బాక్స్‌ డ్రెయిన్లతో పలుచోట్ల ముంపు
అడ్డదిడ్డంగా నిర్మించడంతో సమస్యలు
భారీ వర్షాలొస్తే జనాలు కొట్టుకుపోతారనే ఆందోళన

హర్షవర్దన్‌కాలనీ పార్కు వరకు పనులను తాజాగా మొదలుపెట్టిన కార్మికులు

ఈనాడు, హైదరాబాద్‌,  న్యూస్‌టుడే, యంత్రాంగం: వరద నుంచి కాలనీలను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీలో, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందనే సామెతను తలపిస్తున్నాయి. మూడేళ్ల కిందట సరూర్‌నగర్‌ చెరువు పక్కన ఉండే వేలాది ఇళ్లు 2 నెలలపాటు ముంపులో ఉండగా ఎస్‌ఎన్‌డీపీ పనులు పూర్తయ్యాక కూడా అదే దుస్థితి. కాకపోతే ఇప్పుడు వేరే కాలనీలు మునుగుతున్నాయి. ఇక ఎగువ నుంచి వచ్చే వరదంతా ఒక్కసారిగా బాగ్‌లింగంపల్లి పద్మాకాలనీని ముంచెత్తుతోంది. నగరంలోని అనేక చోట్ల నాలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో నాలాలు మట్టి, వ్యర్థాలతో నిండిపోయాయి. వరదంతా రోడ్లపై నిలుస్తోంది. కొన్నిచోట్ల మనుషులు, వాహనాలు కొట్టుకుపోయేలా నాలాలు నోళ్లు తెరచుకున్నాయి. వర్షాకాలం మొదలయ్యే నాటికి సమస్యలను పరిష్కరించకపోతే కాలనీలకు ముంపు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కాకతీయనగర్‌లో తవ్వి వదిలేశారిలా

నడవలేక జనానికి నరకం

మల్కాజిగిరిలో వినాయక్‌నగర్‌ డివిజన్‌ కాకతీయనగర్‌లో 6 నెలల క్రితం రూ.2 కోట్లతో 300మీటర్ల పొడవునా చేపట్టన పనులను గుత్తేదారు మధ్యలో ఆపేశారు. బిల్లులు రావట్లేదని, సమ్మె చేస్తున్నామని అంటున్నారు. ఇళ్ల మధ్య తవ్విన గుంతలు కాలనీవాసులకు నరకం చూపిస్తున్నాయి. 

ప్రారంభించనివి కొన్ని.. అసంపూర్తిగా మరికొన్ని..

  • ఖైరతాబాద్‌లోని బీజేఆర్‌నగర్‌ బస్తీలో బాక్స్‌డ్రెయిన్‌ను ఒక అడుగు ఎత్తుగా నిర్మించారు. ఇళ్లన్నీ దిగువన ఉండటంతో  వరద నీరు బస్తీలో నిలిచిపోతోంది. 
  • నిజాంపేట నగర పాలక సంస్థలో పాపయ్యకుంట నుంచి సిరిబాలాజీ టవర్స్‌ వరకు 2.5కి.మీ పొడవునా నాలా పనులు ఇంకా మొదలు కాలేదు. బాచుపల్లి భైరుని చెరువు నుంచి అమీన్‌పూర్‌ చెరువు వరకు రూ.53 కోట్లతో 4 కిలోమీటర్ల కాలువ అసంపూర్తిగా ఉంది. తన స్థలం నుంచి కాలువ వెళ్లడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి కోర్టుకెళ్లడంతో పనులాగాయి.
  • కేపీహెచ్‌బీ బ్రాండ్‌ ఫ్యాక్టరీ-రాజీవ్‌ రోటరీ మార్గంలో వరద నీరు బాక్స్‌ డ్రెయిన్‌లోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలుస్తోంది. కొందరు దుకాణదారులు నాలా మూతలను మూసేయడంతోనే ఈ సమస్య. మలేసియన్‌ టౌన్‌షిప్‌ ఎదురుగా ఉన్న  పాదచారుల వంతెన కింద వరద నీరు నడుము లోతున నిలుస్తోంది.  
  • చిన్న వానకే ఎగువ నుంచి వచ్చే వరదతో ఆసిఫ్‌నగర్‌(మల్లేపల్లి) ఫిరోజ్‌గాంధీనగర్‌ ముంపునకు గురవుతోంది.  ఆసిఫ్‌నగర్‌ నయారా పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న గల్లీ నుంచి శీతల్‌ లస్సీ వరకు బాక్సు డ్రెయిన్‌ నిర్మాణానికి దాదాపు రూ.1.84 కోట్లు బల్దియా మంజూరు చేసింది. గతేడాది పనులు ప్రారంభించగా సగం కూడా కాలేదు.

మైత్రీవనం వెనుక 

అమీర్‌పేటలో కదలని నిర్మాణం..

అమీర్‌పేట మైత్రీవనం వెనుక రూ.కోటిన్నరతో చేపట్టిన బాక్స్‌ డ్రైయిన్‌ పనులు ముందుకు సాగడం లేదు. వర్షం వచ్చిన ప్రతీసారి గాయత్రినగర్, ఇతరత్రా వీధులు, అపార్ట్‌మెంట్స్‌ సెల్లార్‌లలో నీరు నిండుతోంది. మరోచోట రూ.35 లక్షల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ డీఈ యతీంద్ర మోహన్‌ తెలిపారు.

ఆర్‌యూబీ వద్ద టన్నుల్లో వ్యర్థాలు

లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి దగ్గర బాక్స్‌ నాలాలో వ్యర్థాలు పేరుకుపోవడంతో వరద వెళ్లే ఆస్కారం లేక ఆర్‌యూబీ ప్రాంతం మునుగుతోంది. దీంతో బాక్స్‌ నాలా స్లాబ్‌ను ధ్వంసం చేసి జేసీబీతో ఇసుక, మట్టి తొలగించారు. చిన్నపాటి బాక్స్‌ నాలాల నిర్మాణాలతో వరదనీరు వంకలు తిరిగి పోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పించారు.

మునుగుతున్న కాలనీలు..

ముషీరాబాద్‌ పరిధి  నాగమయ్య కుంట నుంచి పద్మాకాలనీ మీదుగా చేపట్టిన వరదనీటి నాలా విస్తరణ, అభివృద్ధి పనులు మూడేళ్లయినా పూర్తవ్వలేదు. వర్షం వచ్చిన ప్రతీసారీ పద్మాకాలనీని మురుగు ముంచెత్తుతోంది. గురుదత్త పాఠశాల వద్ద రూ.39 కోట్లతో, నల్లకుంట చౌరస్తాలోని వామాక్షి స్కూల్‌ వద్ద బాక్స్‌ డ్రైన్‌ నిర్మాణ పనులు ఆగిపోయాయి. నల్లకుంట మూన్‌కేఫ్‌ చౌరస్తా వద్ద భూగర్భ విద్యుత్తు తీగలు కొనసాగింపు కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

కంటోన్మెంట్‌కు కష్టకాలమే..

ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌లో రూ.2.5 కోట్లతో బాక్స్‌ డ్రెయిన్‌ పనులను చేపట్టారు. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని హర్షవర్దన్‌కాలనీ, మర్రి రాంరెడ్డినగర్‌కాలనీ, సీతారాంపురం, బాపూజీనగర్‌ చౌరస్తాల మీదుగా ఫిలిప్స్‌ గోడౌన్‌ బ్రిడ్జి వరకు పనులను చేపట్టాల్సి ఉండగా హర్షవర్దన్‌కాలనీ వరకు నాలాను నిర్మించి పనులను ఎన్నికల ముందు నిలిపివేశారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి మల్లికార్జునకాలనీ రోడ్డు నంబర్‌-3లో వరద నీటి కాలువను మధ్యలో వదిలేయడంతో వ్యర్థాలన్నీ కాలువలోకి చేరి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని