logo

రూ.221 కోట్ల పనులు రద్దు

అంతర్గత రహదారులు, నాలాలు, శ్మశానవాటికల్లో సౌకర్యాల కల్పన, ఇతరత్రా పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ గత ప్రభుత్వం ఆమోదించిన పనులను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది.

Updated : 23 May 2024 04:49 IST

ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద గత సర్కారు ఆమోదం

నిధులివ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్గత రహదారులు, నాలాలు, శ్మశానవాటికల్లో సౌకర్యాల కల్పన, ఇతరత్రా పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ గత ప్రభుత్వం ఆమోదించిన పనులను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అభ్యర్థన మేరకు అప్పట్లో పురపాలకశాఖ రూ.221కోట్ల విలువైన 756 పనులకు పచ్చజెండా ఊపింది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అభివృద్ధి నిధులను ఇస్తామని జూన్‌ 28, 2023న బల్దియాకు లేఖ రాసింది. ఆమేరకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం టెండరు ప్రక్రియను ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క పని కూడా పట్టాలెక్కలేదు. టెండరు దశలో ఉన్నవేగాక, టెండరు పూర్తయినవీ మొదలవలేదు. వేర్వేరు కారణాలతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులను రద్దు చేయాలన్న కొత్త సర్కారు సూచనతో.. కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. జోనల్‌ కమిషనర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఆర్థిక విభాగం అధికారులను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్‌ తాజాగా ఉత్తర్వు జారీ చేయడం గమనార్హం.

ఆమోదించిన పనులివే..

ఎల్బీనగర్‌ జోన్‌లో.. మల్లాపూర్‌ డివిజన్‌లోని గ్రీన్‌హిల్స్‌ కాలనీ, హబ్సిగూడ డివిజన్,  రామంతాపూర్‌ డివిజన్‌లో ఇంద్రానగర్, ఆర్‌కేపురం డివిజన్‌లో మొత్తం రూ.1.86కోట్ల విలువైన రోడ్లు, ఇతరత్రా  పనులు ఉన్నాయి.
చార్మినార్‌ జోన్‌లో.. శివగంగ థియేటర్‌ కల్వర్టు, నాలాకు  కంచె నిర్మాణం, వేర్వేరు ప్రాంతా ల్లో సీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక పనులు నిలిచినట్లయింది.
ఖైరతాబాద్‌ జోన్‌లో.. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, విజయ నగర్‌ కాలనీలో వీడీసీసీ రోడ్లు, తదితర వందిలాది పనులు ఆగిపోనున్నాయి.
శేరిలింగంపల్లి జోన్‌లో.. యూసఫ్‌గూడ కృష్ణానగర్, రెహ్మత్‌నగర్‌ డివిజన్‌లో  రోడ్ల పనులు నిలిచిపోయాయి. 
కూకట్‌పల్లి జోన్‌లో.. మూసాపేట వార్డులో స్నేహపురికాలనీ, కబీర్‌నగర్, బీహెచ్‌ఈఎల్‌ రైల్వే గేటు ప్రాంతాల్లో వరద నాలా నిర్మాణం,  ఇతర సీసీ రోడ్ల పనులు ఆగిపోయినట్లే.
సికింద్రాబాద్‌ జోన్‌లో.. బోలక్‌పూర్‌ డివిజన్‌ గుల్షాన్‌నగర్, గాంధీనగర్‌ డివిజన్‌ వివేక్‌నగర్‌లో దాదాపు రూ.2.5కోట్ల రోడ్ల పనులు, ఇతరత్రా పనులు ఆగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని