logo

బడా హోటళ్లలోనూ.. గడబిడే!

రాజధానిలో ఆహారకల్తీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర స్థాయి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు చేపడుతోన్న తనిఖీలతో బడా హోటళ్లలోని డొల్లతనం వెలుగులోకొస్తోంది

Updated : 23 May 2024 08:54 IST

తిండే కాదు.. గిన్నెలూ అపరిశుభ్రమే
టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ఆహారకల్తీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర స్థాయి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు చేపడుతోన్న తనిఖీలతో బడా హోటళ్లలోని డొల్లతనం వెలుగులోకొస్తోంది. బుధవారం జరిపిన తనిఖీల్లో సోమాజిగూడలోని క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్‌ ఓ బార్, కేఎఫ్‌సీలలో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులేని సంస్థల పేరుతో తయారైన ఆహార పదార్థాలు, టీడీఎస్‌ తగిన మోతాదులోలేని తాగునీటి సీసాలు, దుర్గంధంతో కూడిన వంట గదులు, తదితర సమస్యలను అధికారులు గుర్తించారు. ఇటీవల సోదాల్లో.. వడ్డించే గిన్నెలను సవ్యంగా శుభ్రం చేయని హోటళ్లు, రెస్టారెంట్లను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.

అక్కడికక్కడే చర్యలు..

  •  క్రుతుంగ రెస్టారెంట్‌లో.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు లేని రూ.2,100 విలువైన ఆరు కేజీల గంగా గోల్డ్‌ పనీర్‌ ప్యాకెట్లు, ఏప్రిల్‌ 3, 2024 నాటికి గడువు ముగిసిన రూ.1,800విలువైన ఆరు కేజీల మేతి మలాయ్‌ మిశ్రమం, టీడీఏఎస్‌ 4పీపీఎంగా ఉన్న రూ.7,800విలువైన 156 క్రుతుంగ బ్రాండ్‌ తాగునీటి సీసాలు, నాసిరకం మాసాలాలు, రిఫ్రిజిరేటర్‌లో ప్యాకింగ్‌ లేకుండా నిల్వ చేసిన వేర్వేరు మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే చెత్త డబ్బాలో వేశామని, నోటీసు ఇచ్చి, నమూనాలను పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు.
  • రెస్ట్‌ ఓ బార్‌లో.. ప్యాకింగ్‌ సరిగా లేని 50 పిజ్జాలు, ఐదు ప్యాకెట్ల గార్లిక్‌ బ్రెడ్, ఐదు కేజీల న్యూడిల్స్‌ శీతల యంత్రంలో అడ్డదిడ్డంగా నిల్వ ఉంచారని, శాఖాహారం, మాంసాహార పదార్థాలను ఒకే శీతల యంత్రంలో కలిపి నిల్వ చేయడం వంటి లోపాలను గుర్తించి, నాసిరకం ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు యంత్రాంగం తెలిపింది.
  •  కేఎఫ్‌సీలో..అసలైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు లేకుండా ఆహారకేంద్రాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించారు. ః వంటగదుల్లో.. వడ్డించేవాళ్లు, వంట మనుషుల శుభ్రతకు ఆ యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వలేదనిఅధికారులు వెల్లడించారు. సిబ్బంది వైద్య పరీక్షల సర్టిఫికెట్లు, వంట గదిలో బొద్దింకలు, ఇతర కీటకాలను నియంత్రించే వ్యవస్థ లేదని, పేర్కొన్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని