logo

ఊటుపల్లి వాగు.. కబ్జాలతో కనుమరుగు

మహా నగరంలో ప్రాధాన్య ప్రాంతంగా మారిన శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రం పరిధిలో జలవనరులు పరాధీనమవుతున్నాయి. నిరోధించాల్సిన అధికారుల ఉదాసీనతను ఆసరాగా తీసుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు ఏకంగా వరద కాలువలనే కబ్జా చేస్తున్నారు

Updated : 23 May 2024 04:53 IST

వర్షాకాలంలో పొంచిఉన్న ముప్పు

సాయిబాబా ఆలయం సమీపంలో ఊటుపల్లి వాగును పూడ్చివేస్తున్న పొక్లెయిన్‌ 

శంషాబాద్, న్యూస్‌టుడే : మహా నగరంలో ప్రాధాన్య ప్రాంతంగా మారిన శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రం పరిధిలో జలవనరులు పరాధీనమవుతున్నాయి. నిరోధించాల్సిన అధికారుల ఉదాసీనతను ఆసరాగా తీసుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు ఏకంగా వరద కాలువలనే కబ్జా చేస్తున్నారు. ఈ దుశ్చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పది అడుగులకు చేరిందిలా..: శంషాబాద్‌ మండల పరిధిలోని పలు చెరువుల్లో అలుగులు పారిన వరద ఊటుపల్లి వాగు నుంచి హిమాయత్‌సాగర్‌లో కలుస్తుంది. గతంలో 40 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ వాగు ఆక్రమణలతో  తొండుపల్లి నుంచి కొత్వాల్‌గూడ వరకు 3 కిలోమీటర్ల మేర 10 అడుగులకు కుంచించుకుపోయింది. తాజాగా ఊటుపల్లి సాయిబాబా ఆలయం సమీపంలో కొంతమంది వాగులోనే నిర్మాణ వ్యర్థాలతో పూడ్చి చదును చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదతో ముంపునకు గురవుతుండగా తాజాగా వాగునే ఆక్రమించడం తీవ్ర ముప్పునకు దారితీస్తుందని స్థానికులు వాపోతున్నారు.

దర్జాగా భవనాల నిర్మాణం

ఊటుపల్లి వాగు ఓఆర్‌ఆర్, బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఉండడంతో రియల్‌ వ్యాపారుల కన్ను పడింది. కొందరు రియల్‌ వ్యాపారులు వాగుకు ఆనుకొని అక్రమ లేఅవుట్లు వేశారు. ఈ క్రమంలో నీటి వనరునే పూడ్చి వేయడంతో భవనాలు వెలుస్తున్నాయి. రాళ్లగూడ జోషికుంట, ఫిరంగి నాలాలు కబ్జాలకు గురవుతున్నాయి. ఈ విషయంపై ఇరిగేషన్‌ ఈఈ బన్షీలాల్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. కబ్జాలు తమ దృష్టికి రాలేదన్నారు. నీటి వనరులను ధ్వంసం చేసినా, ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవన్నారు. సిబ్బందిని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతామని చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని