logo

అమ్మకానికి ఆడపిల్ల

అభంశుభం తెలియని చిన్నారి అమ్మ ప్రేమకు.. తండ్రి లాలనకు దూరమైంది. పుట్టి నెలరోజులు కూడా కాకముందే అంగడి సరకులా అమ్మకానికి వచ్చింది.

Published : 23 May 2024 06:54 IST

 రూ.4.50 లక్షలకు బేరం
ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆడ శిశువు
మేడిపల్లి (బోడుప్పల్‌),న్యూస్‌టుడే : అభంశుభం తెలియని చిన్నారి అమ్మ ప్రేమకు.. తండ్రి లాలనకు దూరమైంది. పుట్టి నెలరోజులు కూడా కాకముందే అంగడి సరకులా అమ్మకానికి వచ్చింది. పిల్లలు లేని వారికి సాంత్వన చేకూర్చేందుకు అంటూ దళారీలు ఆడుతున్న నాటకానికి పోలీసులు తెరవేశారు. అధిక సంతానం, ఆర్థిక ఇబ్బందులు బిడ్డను విక్రయించేందుకు పురిగొల్పిన అమానవీయ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ రామకృష్ణానగర్‌లో ఐతా శోభారాణి ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను నిర్వహిస్తుంది. బోడుప్పల్‌కు చెందిన శైలజతో ఆమెకు పరిచయం ఉంది. వీరిద్దరూ పిల్లల క్రయ విక్రయాలు చేస్తున్నట్లు అక్షర జ్యోతి ఫౌండేషన్‌ నిర్వాహకులకు తెలిసింది. తమకు పిల్లలు లేరని, పెంచుకోవడానికి పాపో,బాబో కావాలని స్టింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా సంప్రదించారు. ముందు తమ వద్ద  లేరని బుకాయించినా డబ్బు ఆశతో బాబు కావాలంటే రూ. 6 లక్షలు, పాప అయితే రూ. 4.50 లక్షలంటూ మాట్లాడుకున్నారు. ఎవరు ముందుగా లభిస్తే వారినే తీసుకుంటామని ఫౌండేషన్‌ నిర్వాహకులు  బయానాగా రూ. 10వేలు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత   మంగళవారం రాత్రి పాప సిద్ధంగా ఉంది.. డబ్బులు తీసుకొని రావాలంటూ వారికి సమాచారం ఇచ్చారు. బుధవారం క్లినిక్‌ వద్దకు వెళ్లి పాప వివరాలు తెలుసుకున్నారు. మూడు నెలల వయస్సు అని , అధిక సంతానం, ఆర్థిక సమస్యలతో తప్పని పరిస్థితుల్లో అమ్మకానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారంటూ నమ్మబలికారు.  ఫౌండేషన్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే రంగంలోకి దిగి  శోభారాణి, శైలజను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పాపను శిశువిహార్‌కు పంపారు.  అమ్మకానికి సహకరించిన ఉప్పల్‌ ఆదర్శనగర్‌కు చెందిన చింత స్వప్న, అదే కాలనీకి చెందిన షేక్‌ సలీం పాషానూ  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పాప తల్లిదండ్రుల గురించి చెబుతూ ఒకసారి చెంగిచర్లకు చెందిన వారని, మరోసారి విజయవాడ అని మాట మారుస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు బయటపడతాయని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 

మధ్యవర్తులు శోభారాణి, శైలజ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని