logo

మురుగు.. పరుగు!

గ్రేటర్‌లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్‌హోళ్ల ఓవర్‌ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి.

Published : 23 May 2024 04:16 IST

ఒక్క నెలలోనే 43 వేల ఫిర్యాదులు

వానాకాలంలో మరిన్ని ఇబ్బందులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మురుగు పరుగు పెడుతోంది. గత నెల 19 నుంచి ఈ నెల 20 తేదీ వరకు మ్యాన్‌హోళ్ల ఓవర్‌ఫ్లోపై దాదాపు 43,280 ఫిర్యాదులు వచ్చాయి. మ్యాన్‌హోళ్ల మిస్సింగ్‌లపై మరో 882 ఫిర్యాదులు అందాయి. మురుగు ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్లు జలమండలి చెబుతోంది. 60 శాతం వరకు అప్పటికప్పుడు పరిష్కారిస్తున్నామని పేర్కొంటోంది. అయితే చిన్న వర్షానికే అనేక ప్రాంతాల్లో మురుగు సమస్య వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరద పెరిగితే మ్యాన్‌హోళ్ల మూతలు సైతం కొట్టుకుపోతున్నాయి. గతంలో ప్రధాన నగరంలో మాత్రమే జలమండలి మురుగు నిర్వహణ చూసేది. తర్వాత గ్రేటర్‌లోని శివారు సర్కిళ్ల మురుగు నిర్వహణ కూడా జలమండలి కిందకు తేవడంతో పరిధి భారీగా విస్తరించింది. ఫలితంగా మ్యాన్‌హోళ్ల నిర్వహణ, మురుగుకు అడ్డుకట్ట వేయడం సవాలుగా మారుతోంది. 

అక్రమంగా కనెక్షన్లు..

నగరంలో చాలా ప్రాంతాల్లో అక్రమ మురుగు కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు, దుకాణాలు ఇతర సముదాయాలకు సంబంధించి మురుగు కనెక్షన్లును నేరుగా ప్రధాన పైపులకు కలుపుతున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో గతంలో పోల్చితే నివాస సముదాయాలు పెరిగాయి. వ్యక్తిగత గృహాల స్థానంలో అపార్ట్టుమెంట్లు వెలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో మురుగు వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉంటోంది. దీంతో పైపుల సామర్థ్యం సరిపోవడం లేదు. వరద నీటి వైపులను కొన్నిచోట్ల మురుగు నీటి పైపులతో కలిపేయడం వల్ల భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆ వరద తాకిడికి మ్యాన్‌హోళ్లు లేచిపోతున్నాయి. దీంతో మురుగు మొత్తం రోడ్లపై పారుతోంది. దీనికితోడు మురుగు పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త వేస్తున్నారు. సంపుల వద్ద జల్లెడలు లాంటివి అమర్చడం లేదు. ఈ వ్యర్థాలన్నీ పైపుల్లోకి చేరి మురుగుపారుదలకు ఆటంకం ఏర్పడుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నీటి కనెక్షన్లకు సరిసమాన స్థాయిలో అక్రమ మురుగు కనెక్షన్లు ఉన్నాయి.రాత్రి వేళల్లో రోడ్లను తవ్వి అక్రమంగా నల్లాలతో పాటు మురుగు కనెక్షన్లును ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపై విజిలెన్సు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

కార్యాచరణ షురూ...

వచ్చే వానాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు జలమండలి తెలిపింది. మ్యాన్‌హోళ్లు, మురుగు నిర్వహణతో పాటు బోర్డు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. మురుగు, మ్యాన్‌హోళ్ల సమస్యపై వస్తున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు, రోడ్డు పక్కన చిరు వ్యాపారులు చెత్తను మ్యాన్‌హోళ్లలోకి డంప్‌ చేయడంతో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపింది. దీనిపై ఎప్పటికప్పుడు వ్యాపారులతో పాటు హోటళ్లు ఇతరులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించింది. ఈ మేరకు ఆయా కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని