logo

నంబర్లు భళా.. కాసుల గలగల..! రూ.లక్షలు పలుకుతున్న ఫ్యాన్సీ నంబర్లు

అంకెలు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరుగుతుండడంతో రవాణాశాఖ పంటపండుతోంది.

Updated : 23 May 2024 09:33 IST

2023-24లో ఏకంగా రూ.119 కోట్ల ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌ : అంకెలు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరుగుతుండడంతో రవాణాశాఖ పంటపండుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే రూ.119.73 కోట్లు ఆదాయం సమకూరింది. 2014-15లో అది కేవలం రూ.23.24 కోట్లే. పదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరగడం విశేషం. చాలామంది వాహనదారులు తమ ఖరీదైన కార్ల కోసం ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకుంటున్నారు. 2020 వరకు ఫ్యాన్సీ నంబర్లను మ్యాన్‌వల్‌గా వేలం వేసేవారు. దీంతో పారదర్శకత లోపించి అరకొరగానే ఆదాయం సమకూరేది. వాహనదారుల ఆదరణతో 2021 నుంచి ఆర్టీఏ ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించి విక్రయిస్తుండటంతో ఆదాయం అమాంతంగా పెరిగింది. అంతకుముందు సంవత్సరం రూ.79.13 కోట్లు వస్తే..ఆన్‌లైన్‌ చేసిన తర్వాత 2021-22లో ఆదాయం రూ.110.43 కోట్లు దాటింది. ప్రస్తుతం కొత్తగా అమల్లోకి వచ్చిన ‘టీజీ’ కోడ్‌తో తొలి పదివేల నంబర్ల వరకు మధ్యలో ఎలాంటి ఆంగ్ల అక్షరాలు రావు. పది వేలు దాటితే టీజీ09 తర్వాత ఆంగ్ల అక్షరాలు వచ్చి తర్వాత వాహనాల నంబర్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ కొత్తగా ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. తాజాగా టీజీ09 9999 నంబరు ఏకంగా రూ.25 లక్షలపైనే పలకడం విశేషం.  ఓ వ్యక్తి తన రూ.2.50 కోట్ల విలువైన కారుకు ఈ నంబరును ఎంపిక చేసుకున్నారు. ఖరీదైన కార్లకు నంబర్లు ఫ్యాన్సీగా ఉండాలని పోటాపోటీగా వేలంలో పాల్గొని దక్కించుకుంటున్నారు. 99999, 0001 లాంటి నంబర్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటోందని జేటీసీ రమేష్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని