logo

బయటివారితో విద్యుత్తు పనులు

విద్యుత్తు పంపిణీ సంస్థ తమ ఉద్యోగులతో చేయించాల్సిన పనులను శాఖకు సంబంధం లేని వ్యక్తులతో చేయించి.. వారి మరణాలకు కారణమవుతోంది.

Updated : 23 May 2024 04:54 IST

ప్రాణాలు పోతున్నాపట్టించుకోని అధికారులు 

కొండాపూర్‌ ఘటనకు నిరసనగా కేపీహెచ్‌బీ డీఈ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు, సహచర మీటర్‌ రీడర్లు 
ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు పంపిణీ సంస్థ తమ ఉద్యోగులతో చేయించాల్సిన పనులను శాఖకు సంబంధం లేని వ్యక్తులతో చేయించి.. వారి మరణాలకు కారణమవుతోంది. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన లైన్‌మెన్లు కొందరు.. తమ స్థానంలో బయటి వ్యక్తులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే ఏకంగా తమ పనులు చేసేందుకు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించుకున్నారు. నైపుణ్యం లేని వీరంతా పనులు చేసేందుకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. కొండాపూర్‌ పరిధిలో రెండు రోజుల క్రితం మీటర్‌ రీడర్‌ ఆనంద్‌బాబు ఒక అపార్ట్‌మెంట్‌లో మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతంతో చనిపోయారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బాధిత కుటుంబాలు కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తే.. ఏఈ, ఏడీఈ, డీఈలు కలిసి సెటిల్‌మెంట్‌ చేయించి పంపిస్తున్నారు. ఎస్‌ఈలు, సీజీఎంలకు ఈ వ్యవహారం అంతా తెలిసినా.. ఎవరిపైనా చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. 

బాధ్యులెవరు.. కొండాపూర్‌లో జరిగిన విషాదకరమైన ఘటననే తీసుకుంటే.. మీటర్‌ రీడర్‌ పని బిల్లింగ్‌తోనే పూర్తవుతోంది. వీరంతా ప్రైవేటు ఏజెన్సీ పరిధిలో ఉంటారు. ప్రతి బిల్లుకు నిర్ణీత మొత్తం సదరు గుత్తేదారు చెల్లిస్తారని ఇప్పటివరకు డిస్కం చెబుతూ వస్తోంది. మరీ ఇలాంటి వ్యక్తిని మరమ్మతులకు పంపిదెవరు? ఈ పనులు చేయాల్సిన జేఎల్‌ఎం, లైన్‌మెన్, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌... బాధ్యులైన సెక్షన్‌ ఏఈ ఏం చేస్తున్నట్లు? 
జీడిమెట్ల, షాపూర్‌ నగర్, ప్రగతి నగర్, డీపీపల్లి.. ఇలా ప్రతి సెక్షన్‌లోనూ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేని వ్యక్తులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. ఒక్కో ఆర్టిజన్‌.. ముగ్గురు, నలుగురితో పనులు చేయిస్తూ.. తాను విధులకు రాకుండా.. వచ్చినా పైరవీలు చేస్తూ గడుపుతున్నాడు.

కాంట్రాక్ట్‌ నియామకాలు లేక..

గత ప్రభుత్వ హయంలో తీసుకున్న విధానపర నిర్ణయాల లోపాలు కూడా ఇందుకు ఓ కారణం అని అధికారులు అంటున్నారు. ఇదివరకు రెగ్యులర్‌ నియామకాలు జరిగే వరకు అవసరమైన మేర కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించుకునే అవకాశం ఉండేది. గత ప్రభుత్వం విద్యుత్తు సంస్థల్లో కాంట్రాక్ట్‌ నియామకాలను పూర్తిగా బంద్‌ చేసింది. దీంతో సిబ్బంది కొరత పెరిగింది. కొందరు అనధికారికంగా మీటర్‌ రీడర్లు, ఇతర వ్యక్తులతో పనులు చేయిస్తున్నారని తెలిసినా.. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. వయసు రీత్యా పలువురు లైన్‌మెన్లు క్షేత్రస్థాయిలో పని చేసే పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు. 

క్షేత్రస్థాయిలో ఖాళీలతో.. 

డిస్కంలో పైస్థాయిలో అవసరానికి మించిన ఇంజినీర్లు ఉన్నారు. పదోన్నతుల కోసం కొత్త పోస్టులు సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో ఒక సీజీఎం చూసే పనిని.. ప్రస్తుతం ముగ్గురు చూస్తున్నారు. ఒక ఏడీఈ చక్కబెట్టే పనిని ఇప్పుడు ఎస్‌ఈ పర్యవేక్షిస్తున్నారు. అదే క్షేత్ర స్థాయికి వచ్చేసరికి ఆర్టిజన్ల కొరత ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని