logo

నందివాగు ప్రాజెక్టు..ఆక్రమణల పరం

వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయదారులు, స్థిరాస్తి వ్యాపారులు పొలాల పక్కనున్న ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ఆక్రమించేస్తున్నారు.

Published : 23 May 2024 04:58 IST

చర్యలు తీసుకోకుంటే ఆయకట్టుకు ముప్పు

ఎఫ్‌టీఎల్‌ సమీపాన చేపట్టిన నిర్మాణం

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయదారులు, స్థిరాస్తి వ్యాపారులు పొలాల పక్కనున్న ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ఆక్రమించేస్తున్నారు. ఇందుకు నందివాగు ప్రాజెక్టు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. చెరువు కట్ట వరద ఒత్తిడికి గురికాకుండా ప్రాజెక్టు పరిధిలోని శిఖం చివరి అంచు భూములలో ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌) హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ  ఆక్రమణల పరం అవుతున్నాయి.

30 మీటర్ల మేర ఖాళీ స్థలం తప్పనిసరి

దాదాపు 2,650 ఎకరాలకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో మండల పరిధి కాస్లాబాద్‌ గ్రామ సమీపాన 1900 ఎకరాల భూమిని స్థిరీకరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 1979లో అప్పటి సర్కార్‌ ప్రారంభించింది. 
ఎఫ్‌టీఎల్‌ నుంచి 30 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. దీన్లో ఎలాంటి శాశ్వతమైన కట్టడాలు చేపట్టకూడదనే నిబంధనలను దృష్టిలో ఉంచుకొని హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని కొట్టిపారేస్తూ శిఖం సమీపాన ఉన్న వ్యవసాయ భూముల యజమానులు హద్దు రాళ్లు ఉన్నవైపు పొలాల్లోకి వరద నీళ్లు రాకుండా ఎత్తయిన కట్టలు నిర్మిస్తున్నారు.  దీనివల్ల నీటి ప్రవాహం వెనుక వైపు వెళ్లేందుకు స్థలం కొరవడుతుంది. దీంతో చెరువు కట్టకు తీవ్ర నీటి ఒత్తిడి ఏర్పడే ఆస్కారం ఉంది. ఖాళీ స్థలం ఉంటే ఆయకట్టులోకి¨ చేరిన నీటి ప్రవాహం నిల్వ ఉంటూ మిగతా వరద నీరు అలుగుల ద్వారా ప్రహహిస్తుంది. తద్వారా చెరువు కట్టకు ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని కొందరు స్థానికులు తెలిపారు.  


పరిశీలించి చర్యలు తీసుకుంటాం
- వరప్రసాద్, ఇరిగేషన్‌ ఏఈ, మోమిన్‌పేట 

ప్రాజెక్టు శిఖం ఆక్రమిస్తూ రైతులు ఎత్తయిన కట్టలు నిర్మిస్తున్నారనే విషయమై పరిశీలిస్తాం. ఈ ప్రాజెక్టు వద్ద శాశ్వత కట్టడాలకు అనుమతి లేదు. నిబంధ]నలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన పనులను పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని