logo

ఆశలు పెంచి.. నిరాశలో ముంచి..!

భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ‘ధరణి’తో పోర్టల్‌ వల్ల నేటికీ ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా వేలాది సమస్యలు పేరుకుపోయాయి

Published : 23 May 2024 05:05 IST

ధరణి తప్పులతో ప్రజలకు తిప్పలు

పూడూరు తహసీల్దారు కార్యాలయం వద్ద అర్జీదారులు  
న్యూస్‌టుడే, వికారాబాద్, తాండూరు గ్రామీణ, పూడూరు: భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ‘ధరణి’తో పోర్టల్‌ వల్ల నేటికీ ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా వేలాది సమస్యలు పేరుకుపోయాయి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

ఏ చిన్న పొరపాటు దొర్లినా..

భూముల క్రయవిక్రయాలతో పాటు దస్త్రాల నవీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు గత ప్రభుత్వం అత్యంత సాంకేతికతతో కూడిన ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల పలు చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రధానంగా డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకంలో ఏ చిన్న తప్పు దొర్లినా సవరించుకునే అవకాశం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. 
గత మూడేళ్లుగా కర్షకుల విన్నపం మేరకు 11 రకాల సమస్యల పరిష్కారానికి సిటిజన్‌ లాగిన్‌లో ‘అప్లికేషన్‌ ఫర్‌ పాస్‌బుక్‌ డేటా కరెక్షన్‌’ (పొరపాట్ల సవరణ దరఖాస్తు) పేరిట నూతన ఐచ్ఛికాలను అందుబాటులోకి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.  ః సవరణ కోసం సమర్పించిన దరఖాస్తులను తొలుత కలెక్టర్లు పరిశీలించి క్షేత్రస్థాయి విచారణ నిమిత్తం ఆయా మండలాల తహసీల్దార్లకు పంపిస్తారు. సహేతుకమైన కారణం చెప్పకుండానే తిరస్కరిస్తుండటంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.  
‘భూమాత’ ఎప్పుడొస్తుందో...: ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ‘భూమాత’ పేరిట నూతన పథకం ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక పలు దఫాలు ధరణిపై చర్చించినా నేటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం మార్పుతో ధరణి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.   

పైసలిస్తేనే భూమి రిజిస్ట్రేషన్‌ 

అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ భూ యాజమాన్యపు హక్కుల్ని బదలాయించాలంటే రెవెన్యూ అధికారుల చేయి తడపాల్సిందేనని రైతులు వాపోతున్నారు. తాండూరు రెవెన్యూ పరిధిలో కొందరు సిబ్బంది ఎకరానికి రూ.5వేల చొప్పున లేదంటే ఒక లావాదేవీకి రూ.5వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఏవైనా పత్రాలు లేకుంటే అధికారులు అడిగినంత (రూ.10వేల నుంచి రూ.50వేలు) ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. 


ఆధారాలతో అర్జీ పెట్టినా ఫలితం లేదు 
- నర్సిములు, కొత్తపల్లి

నాకు రావాల్సిన 1.20 ఎకరాల భూమి ధరణి వచ్చిన తరువాత గ్రామంలోని మరొకరి పేరున నమోదైంది. మార్చాలని కోరుతూ తగిన ఆధారాలతో అర్జీ పెట్టుకుని రెండేళ్లుగా తిరుగుతున్నా. ఇప్పటివరకు పరిష్కారం కాకపోవటంతో మరోసారి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేశా. నేటికీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.  


 కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా..
- వనంపల్లి ఇంద్రారెడ్డి, పెండ్లిమడుగు, వికారాబాద్‌

పెండ్లిమడుగులో 2017లో 0-16 ఎకరాల భూమి కొనుగోలు చేశా. పాత పాస్‌ పుస్తకం వచ్చింది.  ధరణిలో మాత్రం అదే గ్రామానికి చెందిన జంగంగారి ఇంద్రారెడ్డి, తండ్రి ధర్మారెడ్డి అంటూ పేరే నమోదై అతనికి కొత్త పాస్‌ పుస్తకం వచ్చింది. తప్పును సవరించాలని నేటికీ తిరుగుతూనే ఉన్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని