logo

ఆత్మీయ జ్ఞాపకం.. నెరవేరని లక్ష్యం

సందర్శకులకు ఆహ్లాదం పంచే లక్ష్యంతో పాటు తమ పూర్వీకుల గుర్తుగా ఉంటుందనే ఉద్దేశంతో ధారూర్‌లో ఏర్పాటుచేసిన ‘స్మృతి వనం’ ప్రజాదరణకు దూరమవుతోంది.

Published : 24 May 2024 01:55 IST

ప్రజాదరణకు దూరంగా స్మృతి వనం

నిరుపయోగంగా వన ప్రాంగణం

న్యూస్‌టుడే, ధారూర్, వికారాబాద్‌: సందర్శకులకు ఆహ్లాదం పంచే లక్ష్యంతో పాటు తమ పూర్వీకుల గుర్తుగా ఉంటుందనే ఉద్దేశంతో ధారూర్‌లో ఏర్పాటుచేసిన ‘స్మృతి వనం’ ప్రజాదరణకు దూరమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో అలంకారప్రాయంగా మారుతోంది. 

ఆత్మీయుల పేరు మీద మొక్కల పెంపకం

జీవిత కాలం తమకు సేవ చేసి గతించిన కుటుంబ పెద్దల జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా ఆత్మీయుల పేరుమీద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలనే లక్ష్యంతో 2019లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ధారూర్‌ మండల కేంద్రంలోని సోమశంకరప్ప దేవాలయం సమీపంలో తాండూర్‌- వికారాబాద్‌ ప్రధాన రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 6 ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం అప్పటి పాలనాధికారి ఒమర్‌జలీల్‌ రూ.19.04 లక్షల నిధులు మంజూరు చేశారు. వీటితో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఊయలలు, జారుడు బల్లలు, పెద్దలు సేద తీరడానికి అందమైన కట్టడం, చెట్లకింద కూర్చోవడం కోసం రచ్చబండలు నిర్మించారు. అందరినీ ఆకట్టుకునేలా అందమైన ముఖద్వారం దానికి ఇరువైపులా వివిధ రకాల జంతు, ప్రకృతి సౌందర్య చిత్రాలు వేయించారు. ఆరంభంలో అందరి దృష్టి ఆకర్షించినా కాలక్రమంలో పర్యవేక్షణ లేక కళా విహీనంగా మారింది.

ఇప్పటి వరకు కేవలం ఆరుగురే..

స్మృతి వనం ఏర్పాటుచేసి ఐదేళ్లు గడుస్తున్నా మొక్కలు నాటించే కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఆరుగురు ఉన్నతాధికారులు మాత్రమే మొక్కలను ఇక్కడ నాటారు. అటవీ శాఖ అధికారులు కొన్ని మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవచూపి మరింత అవగాహన కల్పిస్తే వనం ప్రజాదరణ పొందుతుందని, ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతుందని స్థానికులు కోరుతున్నారు.  

మొక్క నాటేందుకు రూ.5,000 జమచేస్తే చాలు

స్మృతి వనంలో ఆత్మీయుల పేరిట మొక్కలు నాటాలనుకునే వారు అటవీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే బ్యాకు ఖాతాలో ఒక్కో మొక్కకు రూ.5 వేలు జమచేస్తే చాలు. అటవీ సిబ్బంది మొక్కలు నాటి సంరక్షిస్తారు. అందుకోసం స్మృతి వనంలోనే వివిధ రకాల మొక్కలను అందుబాటులో ఉంచారు. కొందరు ఆత్మీయుల జ్ఞాపకాలు ఎన్నటికీ మరువలేనివి. అలాంటి వారి పేరుమీద మొక్కలు నాటి వాటి నీడన కూర్చుని వారితో ఉన్న అనుబంధాన్ని, గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటే ఆ అనుభూతే వేరు. తమ ఆత్మీయుల పేరున నాటిన మొక్క ఎలా ఉందో పరిశీలించుకునే అవకాశం కూడా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు