logo

ఎంఆర్‌డీసీఎల్‌ ఎస్‌ఈ వెంకటరమణ మృతి

మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) సూపరింటెండెంట్‌ ఇంజినీరు వెంకటరమణ గురువారం మృతిచెందారు.

Published : 24 May 2024 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) సూపరింటెండెంట్‌ ఇంజినీరు వెంకటరమణ గురువారం మృతిచెందారు. ఏప్రిల్‌ 30న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయనకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే అధికారులు ఆయనను సోమాజిగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎస్సార్డీపీ విభాగంలో కీలకంగా పనిచేశారని, పలు పైవంతెనలు, అండర్‌పాస్‌లను వేగంగా నిర్మించడంలో క్రియాశీలపాత్ర పోషించారని తోటి ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు.


ఐదో అంతస్తు నుంచి దూకిన వృద్ధురాలు


శశికళ

చైతన్యపురి, న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలతో ఓ వృద్ధురాలు ఐదో అంతస్తు నుంచి దూకింది. ఈఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టరు వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. న్యూమారుతీనగర్‌లోని మారుతీ హైట్స్‌లో ప్రైవేటు ఉద్యోగి మహేశ్‌ తల్లి శశికళ(69), భార్యాపిల్లలతో ఉంటున్నాడు. శశికళ కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతోంది. గురువారం ఉదయం లిఫ్ట్‌లో భవనం ఐదో అంతస్తు చేరుకుంది. పిట్ట గోడ వద్ద కుర్చీ వేసుకొని పైనుంచి కిందకు దూకింది. వాచ్‌మెన్‌ గమనించి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు. వారు వచ్చి చూసేసరికి మృతిచెందింది.


గొలుసు చోరీ.. మహిళలకు గాయాలు

సునీత

పోచారం (ఘట్‌కేసర్‌), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీకూతుళ్లను వెంబడించి మెడలోని బంగారు గొలుసును స్నాచర్లు లాక్కొవడంతో కిందపడిపోయారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అన్నోజిగూడ దగ్గర గురువారం సాయంత్రం జరిగింది. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీకి చెందిన సునీత(50) పొదుపు సంఘం డబ్బులను జోడిమెట్లలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో జమ చేయడానికి ద్విచక్రవాహనంపై వెళ్లింది. ఆ తర్వాత కుమారై శ్రీజను ఎక్కించుకుని ఘట్‌కేసర్‌కు బయలుదేరింది. అన్నోజిగూడ వంతెనపైకి రాగానే వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకుల్లో ఒకడు శ్రీజ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొన్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి తల్లికుమార్తెలు పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు.


ఆర్టీసీ నకిలీ లోగో.. ఇద్దరిపై కేసు

రాంనగర్, న్యూస్‌టుడే: ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఇద్దరు వ్యక్తులపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి ఠాణాలో కేసు నమోదైంది. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ సంస్థ లోగో మారినట్లు కొణతం దిలీప్, హరీశ్‌రెడ్డిలు ఫేక్‌ లోగో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే, ఇప్పటివరకు కొత్త చిహ్నాన్ని తమ సంస్థ అధికారికంగా విడుదల చేయలేదని, ఫేక్‌ లోగోను సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బస్‌ భవన్‌కు చెందిన ఉన్నతాధికారి ఎ.శ్రీధర్‌ గురువారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


పెట్టుబడికి రెట్టింపు ఇస్తామని నమ్మించి.. పత్తాలేకుండా పోయారు

జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా గ్రూపు ఎండీపై కేసు

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా గ్రూపు ఎండీపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన వద్దలపు పవన్‌కుమార్‌ తల్లి సునీత, మరదలు దాసరి వనమాల నారాయణఖేడ్‌ వద్ద ఫామ్‌ లాండ్‌ ప్రాజెక్ట్స్‌లో రూ.1.2కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈమేరకు జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా గ్రూప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ శిల్ప ద్వారా 2022లో డబ్బులు చెల్లించారు. రెండేళ్లకు రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ సంస్థ వారిని నమ్మించింది. ఇందుకు సంబంధించి జీఎస్‌ఆర్‌ సంస్థ ఎండీ గుంటుపల్లి శ్రీనివాస్‌రావు తన భార్య పద్మజ పేరుతో ఆరు ఐసీఐసీఐ బ్యాంకు చెక్కులను వారికి ఇచ్చారు. పెట్టిన పెట్టుబడికి డబ్బులు చెల్లించాల్సిన సమయం ముగియడంతో వాటిని అడిగేందుకు పవన్‌కుమార్‌ తన తల్లి సునీత, మరదలు వనమాలతో కలిసి మాదాపూర్‌లోని జీఎస్‌ఆర్‌ కార్యాలయానికి వెళ్లగా మూసేసి కనిపించింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని సంస్థ మరో కార్యాలయానికి వెళ్లగా అదీ మూసేసి ఉంది. గుంటుపల్లి శ్రీనివాస్‌రావు, శిల్ప చరవాణులు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. పవన్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని