logo

బాలలూ.. మీకెందుకు వాహనాలు

మద్యం తాగి కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన పుణెకు చెందిన మైనర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో గ్రేటర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated : 24 May 2024 05:22 IST

పుణె ఘటన నేపథ్యంలో గ్రేటర్‌లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: మద్యం తాగి కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన పుణెకు చెందిన మైనర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో గ్రేటర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలోనూ మైనర్లు విచ్చలవిడిగా కార్లు, బైకులు నడుపుతున్నారు. తల్లిదండ్రులు వారించక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పుణెలో 12వ తరగతి విద్యార్థి మద్యం తాగి కారు అతివేగంగా నడిపి బైక్‌పై వెళుతున్న ఇద్దరు టెకీలను ఢీకొనడటంతో వారు మృతిచెందగా మైనర్‌కు వెంటనే బెయిల్‌ రావడంతో మృతుల కుటుంబికులు ఆందోళనకు దిగారు. మైనర్‌కు కారు ఇచ్చినందుకు, మద్యం సరఫరా చేసినందుకు తండ్రితోపాటు బార్‌ యజమానులను అరెస్టు చేసినా ఆందోళన ఆగడం లేదు. 18 ఏళ్లు నిండిన తర్వాతే డ్రైవింగ్‌ నేర్చుకొని లైసెన్సు పొందిన తర్వాతే కారు లేదా ద్విచక్ర వాహనాలు నడిపేందుకు అర్హత వస్తుంది. నగరంలో పదోతరగతి, ఇంటర్‌ చదివేవారే డ్రైవింగ్‌ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలిసి కొందరు, తెలియక కొందరు వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం, నిబంధనలు గురించి తెలియక ప్రమాదాలకు కారణమవుతున్నారు.

దొరికితే ఇబ్బందే..

మైనర్లు వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. పెద్దలు అభ్యంతరం చెప్పకపోవడం కూడా నేరమే. అలా చేస్తే వాహన యజమాని శిక్షార్హుడు. ముఖ్యంగా యువత, ఉద్యోగులకు జైలుశిక్ష పడితే వారి కేరీర్‌పై ప్రభావం చూపుతుంది. నగరంలో జరుగుతున్న తనిఖీల్లో 20-30 శాతం మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు ఉండటం లేదు. కొందరు లైసెన్సులు గడువు తీరినా పునరుద్ధరించుకోవడం లేదు.

శిక్షణే రక్షణ..

  • కారు లేదా బైకు నడపాలంటే శిక్షణ తప్పనిసరి. డ్రైవింగ్‌ శిక్షణ స్కూలు పకడ్బందీగా ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత నమూనా కారులాంటి యంత్రం (సిమ్యులేటర్‌) తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
  • యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్‌పై అవగాహన కల్పిస్తారు. 1 నుంచి 5 వరకు గేర్లు ఎలా మార్చాలి.. ఎక్కడ ఏ గేరు వాడాలి.. పూర్తిగా గేర్లు మార్చే విధానంపై శిక్షణ ఉంటుంది.
  • వాహనం ఎత్తుగా ఉన్న ప్రాంతానికి వెళ్లేటప్పుడు, పల్లపు ప్రాంతానికి దిగేటప్పుడు ఏం చేయాలి.. ఎడమ, కుడి మలుపులు, యుటర్న్‌లు తీసుకునేప్పుడు జాగ్రత్తలు చెబుతారు.
  • ఇక రహదారులపై ట్రాఫిక్‌లో నడిపే విధానం.. ఓవర్‌ టేకింగ్‌.. సిగ్నళ్ల వద్ద నిలిచే విధానం.. ఏ గేరులో ఉండాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలను సిమ్యులేటర్‌పై శిక్షకుడు వివరిస్తారు.
  • వర్షం, మంచు కురుస్తున్న సమయంలో డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏ లైట్లు వినియోగించాలో నేర్పిస్తారు. స్టీరింగ్‌ పట్టుకునే విధానం.. దానిని ఉపయోగించే తీరుపై సిమ్యులేటర్‌పై నేర్చుకోవచ్చు.
  • ట్రాఫిక్‌ నిబంధనలు.. సూచనలు.. ఆర్టీఏ చట్టాలు.. వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు గురించి వివరిస్తారు.
  • శిక్షణకు ముందు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకోవాలి. అది ఉంటేనే శిక్షణ వాహనం నడపేందుకు అవకాశం ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం ఇస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని