logo

లేలేత ప్రాయం... ‘సెల్‌’గాటం

అంతా మైనర్‌ కుర్రాళ్లే.. సాయంత్రం దాటినా.. ఒంటరిగా కనిపించినా చెలరేగిపోతారు. గల్లీల్లో నడుచుకుంటూ వెళ్లేవారిని మాటల్లో పెట్టి ఫోన్లు లాక్కుంటారు.

Updated : 24 May 2024 05:10 IST

ఓ ముఠా నుంచి హైదరాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు (పాత చిత్రం)

ఈనాడు, హైదరాబాద్‌: అంతా మైనర్‌ కుర్రాళ్లే.. సాయంత్రం దాటినా.. ఒంటరిగా కనిపించినా చెలరేగిపోతారు. గల్లీల్లో నడుచుకుంటూ వెళ్లేవారిని మాటల్లో పెట్టి ఫోన్లు లాక్కుంటారు. నిర్మానుష్య ప్రాంతంలో ఒక్కరే కనిపిస్తే అటకాయించి అందినకాడికి దోచుకుని భయభ్రాంతులకు గురిచేస్తారు. అవసరమైతే హతమార్చేందుకు వెనుకాడరు. నగరంలో సెల్‌ఫోన్‌ చోరీల్లో ఎక్కువగా మైనర్లు పట్టుబడడం ఆందోళన రేకెత్తిస్తోంది. కొన్నినెలలుగా మూడు కమిషనరేట్లలో సెల్‌ఫోన్‌ చోరీ కేసులు.. వాటిలో పట్టుబడ్డ నిందితుల నేపథ్యాన్ని పరిశీలించగా.. ఎక్కువ మంది మైనర్లు, 20 ఏళ్లలోపువారు అధికంగా ఉంటున్నారు. ప్రధానంగా కొందరు పాత నేరగాళ్లు, పిక్‌పాకెట్‌ గ్యాంగ్‌లు.. యువకులు, మైనర్లకు వేతనాల తరహాలో నెలవారీగా కొంత మొత్తం లేదా ఖర్చులకు సరిపడా డబ్బులిచ్చి సెల్‌ఫోన్‌ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని గ్యాంగ్‌లు ఎన్ని ఫోన్లు చోరీ చేస్తే అంత కమిషన్‌ అన్నట్లు ఆశపెడుతున్నాయని, మైనర్లను ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వీళ్లకు ఖర్చులు.. వాళ్లకు ఆదాయం

గతంలో పిక్‌పాకెటింగ్‌ గ్యాంగ్‌లు రద్దీ ప్రదేశాలు, బస్సులు, రైళ్లలో చోరీ చేసి సొమ్ము చేసుకునేవారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాక జేబులో నగదు పెట్టుకునేవారి సంఖ్య తగ్గింది. పిక్‌పాకెటర్లు చోరీ చేస్తున్నా డబ్బు దొరకడం లేదు. దీంతో సెల్‌ఫోన్‌ చోరీలపై దృష్టిసారించారు. పెద్దలైతే పట్టుబడితే చితకబాదుతారని.. మైనర్లు, తక్కువ వయసున్నవారైతే చూసీచూడనట్లు వదిలేస్తారనే ఉద్దేశంతో కొన్ని గ్యాంగ్‌లు మైనర్లు, 20 ఏళ్లలోపు యువకుల్ని రంగంలోకి దించుతున్నాయి. ప్రధానంగా చదువు మధ్యలో మానేసినవారు, తల్లిదండ్రుల ఆలనాపాలనా సరిగా లేక జులాయిగా తిరిగే కుర్రాళ్లు ఈ ముఠాల లక్ష్యం. వారి జల్సాలు, ఇతర అవసరాలకు డబ్బు ఆశచూపి ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత డబ్బు ఎక్కువ అవసరముంటే సెల్‌ఫోన్‌ దొంగతనాలు చేయాలని ఆశపెడుతున్నారు. కొందరికి రుణాలు ఇచ్చి తీర్చకపోతే చెప్పినట్లు చేయాలంటూ మెలికపెడతారు. దారిలేని పరిస్థితుల్లో కొందరు మైనర్లు, యువకులు స్నేహితులతో కలిసి చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు సరిపోక చోరీల బాట పడుతున్నారు. మెజార్టీ కేసుల్లో యువకులు రూ.వెయ్యి రూ.2 వేలకు ఆశపడి ఫోన్లు చోరీ చేస్తున్నారు.

ఎంతోకొంతకు అమ్మడమే

నగరంలో చోరీ ఫోన్లకు పెద్ద మార్కెట్‌ ఉంది. కొట్టేసిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను మార్చేసే ముఠాలు.. అవసరమైతే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించి సగం ధరకు అమ్మేసేవారున్నారు. ఇటీవల హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ దొంగిలించే ముఠాలోని 17 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో కొట్టేసిన ఫోన్లను వీరు సుడాన్‌ దేశానికి తరలించి అమ్మేస్తున్నారు. ఇతరులకు విక్రయించడానికి సాధ్యంకాని ఖరీదైన, భద్రత వ్యవస్థలు ఎక్కువగా ఐఫోన్‌ వంటి వాటి విడిభాగాలను ఊడదీసి తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. నగరంలోని కొన్ని సెల్‌ఫోన్‌ దుకాణాల్లో కొట్టేసిన ఫోన్లు విక్రయించడాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొందరు దుకాణ యజమానులు మైనర్లతో చోరీచేయిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

ఫిర్యాదుకు ససేమిరా

నగరంలో ఏటా వేల సంఖ్యలో ఫోన్లు చోరీ ఘటనలు నమోదవుతున్నా చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు కేంద్ర టెలికాం విభాగం సీఈఐఆర్‌ పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఫిర్యాదుల సంఖ్య, ఫోన్ల రికవరీ పెరిగింది. ఒక ఫోన్‌పోతే ఇంకోటి కొనుక్కోవచ్చని లేదా పాత ఫోన్‌ కదా అని వదిలేయడం వంటి కారణాలు ఉంటున్నాయి.

ఇవీ ఉదాహరణలు..

  • గుడిమల్కాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యువకుడు బస్సు కోసం ఎదురుచూస్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. బాధితుడు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా కత్తులతో దారుణంగా పొడిచారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించారు. ఆ ఇద్దరిలో ఒకరికి 19 ఏళ్లు, ఇంకొకరు మైనర్‌.
  • సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలో దొంగిలించి సుడాన్‌ దేశానికి పంపిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరూ 19 కుర్రాళ్లు. వీరి కొట్టేసిన ఫోన్లను కొందరు సెల్‌ఫోన్‌ దుకాణ యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత మన దేశంలో సుడాన్‌ దేశస్థులు కొని.. వారి దేశానికి అక్రమంగా పంపిస్తున్నారు.
  • బుధవారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ దొంగిలిస్తున్న యువకుల్ని అరెస్టు చేశారు. ఇందులో నలుగురు మైనర్లు, మిగిలిన ఐదుగురూ 19 ఏళ్ల కుర్రాళ్లు కావడం గమనార్హం. జల్సాల కోసం సెల్‌ఫోన్‌ దొంగతనాలు చేస్తున్నట్లు వీరంతా అంగీకరించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు