logo

27 వారాలు.. అరకిలో బరువు

ఇరవై ఏడు వారాలు.. అందులోనూ కేవలం ‘565’ గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు హైదరాబాద్‌లోని ‘నిలోఫర్‌ ఆసుపత్రి’ వైద్యులు సుమారు రెండు నెలల పాటు ప్రత్యేక చికిత్సను అందించి పునర్జన్మ ప్రసాదించారు.

Updated : 24 May 2024 05:17 IST

పసికందు ప్రాణం నిలిపిన నిలోఫర్‌ వైద్యులు

కోలుకున్న శిశువుతో తల్లి ముస్తాన్, నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డా.ఉషారాణి, వైద్య బృందం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: ఇరవై ఏడు వారాలు.. అందులోనూ కేవలం ‘565’ గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు హైదరాబాద్‌లోని ‘నిలోఫర్‌ ఆసుపత్రి’ వైద్యులు సుమారు రెండు నెలల పాటు ప్రత్యేక చికిత్సను అందించి పునర్జన్మ ప్రసాదించారు. గురువారం శిశువును డిశ్ఛార్జ్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన రిజ్వాన్‌ భార్య ముస్తాన్‌ గర్భం దాల్చింది. అయితే ఆమె ఒలిగోహైడ్రామ్నియోస్‌ (ఉమ్మునీరు తగ్గిపోవడం) సమస్యతో బాధపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్‌లో వైద్యులు అత్యవసరంగా ఐఎస్‌సీఎస్‌ విధానం ద్వారా పురుడు పోయగా.. ఆడ శిశువు జన్మించింది. కేవలం 565 గ్రాముల బరువు ఉన్న శిశువుకు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉంది. నవజాత శిశువులకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయో దాదాపు అన్ని సమస్యలూ శిశువుకు చుట్టుముట్టాయి.  శిశువును రెండు నెలల క్రితం  నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్‌ స్వప్న, డాక్టర్‌ అలివేలు, డాక్టర్‌ సురేష్‌ల బృందం చికిత్స మొదలుపెట్టారు. శ్వాసను అందించడానికి శిశువుకు సీపీఏపీతో అనుసంధానం చేశారు. యాంటీబయోటిక్స్‌ ఇతరత్రా మందులు ఇవ్వడం ప్రారంభించారు. తగినంత బరువు పెరగడం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో 53 రోజుల్లో శిశువు బరువు 565 గ్రాముల నుంచి 1.460 కిలోలకు పెరిగింది. పూర్తి ఆరోగ్యం సంతరించుకుందని భావించిన వైద్యులు గురువారం శిశువును డిశ్ఛార్జ్‌ చేశారు. ప్రతీ నెలా ఒకసారి పరీక్షల నిమిత్తం తీసుకురావాలని శిశువు తల్లిదండ్రులకు వైద్యులు సూచించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఉషారాణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని