logo

చెరువు కనిపిస్తే .. చెరపట్టుడే

హైదరాబాద్‌ చుట్టూ సహజసిద్ధమైన చెరువులుంటే చాలు.. రియల్‌ వెంచర్ల కోసం కొందరు పాగా వేస్తున్నారు.

Updated : 24 May 2024 05:24 IST

నీటి వనరుల ఆక్రమణలు పట్టించుకోని అధికారులు
రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కబ్జాదారుల ఇష్టారాజ్యం
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, రాయదుర్గం

మియాపూర్‌ మీదికుంటను పూడ్చివేశారిలా

హైదరాబాద్‌ చుట్టూ సహజసిద్ధమైన చెరువులుంటే చాలు.. రియల్‌ వెంచర్ల కోసం కొందరు పాగా వేస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలతో వాటిని పూడ్చేస్తున్నారు.  ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పదుల సంఖ్యలో చెరువులను ఆక్రమించేశారు.  మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో 1720, మేడ్చల్‌ జిల్లాలో 890 చెరువులు ఉండగా వీటిలో 30శాతం కబ్జాకు గురయ్యాయి. చెరువులను పరిరక్షించేందుకు పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏ, పర్యాటక శాఖ అధికారులు సుందరీకరణ పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనాలు నామమాత్రంగానే ఉన్నాయి.

మాదాపూర్‌ జంగంమోని కుంటలో..¦

కుంటలు మాయం

శేరిలింగంపల్లి మండలం  కొండాపూర్‌ సర్వే నంబరు 133, 134లో 2.35 ఎకరాల మేర జంగంమోని కుంట ఉంది. దీన్ని కబ్జాదారులు మట్టితో పూడ్చేస్తున్నారు. ఇప్పటికే బండరాళ్లు, మట్టి నింపి చదునుచేయడంతో కుంట పూర్తిగా మైదానంలా తయారైంది.  ఈ కుంట స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.వంద కోట్లు ఉంటుంది. పరిరక్షించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇక మియాపూర్‌ బస్‌ డిపో సమీపంలోని మీది కుంటను మట్టితో పూడ్చి మాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎకరా ధర రూ.50కోట్ల పైమాటే. రియల్‌ వెంచర్లు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు     తెలిపారు.

శేరిలింగంపల్లి.. గండిపేట్‌.. రాజేంద్రనగర్‌..  

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో చెరువుల పరిరక్షణకు వాటి సుందరీకరణకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా మరోవైపు కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లో అధికంగా చెరువులను ఆక్రమించేస్తున్నారు. రాత్రివేళ నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో పోస్తున్నారు.  ఈ మూడు మండలాల్లో 38 చెరువులను ఇలాగే ఆక్రమించి రియల్‌ వెంచర్లు వేశారు. కొందరైతే ఎఫ్‌టీఎల్‌ పరిధుల్లో విల్లాలు నిర్మిస్తున్నారు. ఇక మేడ్చల్‌ జిల్లాల్లోని శామీర్‌పేట పెద్ద చెరువు సహా తూంకుంట మున్సిపాలిటీ, జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధుల్లోని చెరువుల్లో నిర్మాణాలు చేపట్టారు. కుంటల మధ్యలో సీసీరోడ్లు వేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని