logo

అడుగుకో అగాధం.. ప్రమాదాల ప్రయాణం

రాజధానిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సగానికిపైగా వీధుల్లో గుంతలు  దర్శనమిస్తున్నాయి. అర కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి. నాలుగేళ్లుగా రహదారి పనులు నిలిచి పోవడమే ఇందుకు కారణం.

Published : 24 May 2024 05:23 IST

వర్షమొస్తే మరింత నరకం

కేపీహెచ్‌బీలో ఛిద్రమైన దారి

రాజధానిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సగానికిపైగా వీధుల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి. అర కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి. నాలుగేళ్లుగా రహదారి పనులు నిలిచి పోవడమే ఇందుకు కారణం. ఫలితంగా వాహనదారులు తరచూ  ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో ప్రయాణిస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు. వర్షం కురిస్తే వరదతో రోడ్లు మరింత ప్రమాదకరంగా మారుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

 ఈనాడు, హైదరాబాద్‌

ఉదాహరణలివిగో..

  •  ఉప్పరపల్లి నుంచి నలందా నగర్‌ మీదుగా లంగర్‌హౌజ్‌ వెళ్లే రోడ్డుపై అడుగడుగునా గుంతలే. అత్తాపూర్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, కాటేదాన్‌ ప్రాంతాల్లోని కాలనీ రోడ్లు దారుణంగా ఉన్నాయి.

లంగర్‌హౌజ్‌లోని ప్రధాన రహదారి

  • లంగర్‌హౌజ్‌ ప్రధాన రహదారిపై వర్షం వెలిసినా.. వరద అలాగే ఉంటుంది. దాదాపు వంద మీటర్ల మేర వరద నిలుస్తోంది.
  • మల్కాజిగిరి సాయినగర్‌ సూర్యా టవర్‌ లేన్‌ రోడ్డును ఏడాది క్రితం తవ్వి, నేటికీ పనులు చేపట్టలేదు.
  • కేపీహెచ్‌బీ కళామందిర్‌ వద్ద, కొండాపూర్‌లోని కొత్తగూడ ల్యాండ్‌ మార్క్‌ రెసిడెన్సీ చుట్టుపక్కల కాలనీ రోడ్లపై అడుగడుగునా గుంతలే.
  • ఓల్డ్‌ అల్వాల్‌ మంజీర కాలనీ, ఆర్‌కేపురం సైనిక్‌ నగర్‌లో ఏడాది కింద తవ్వి, నేటికీ మరమ్మతు చేయలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

కాలనీ  రహదారులే ఎక్కువ..

  • సీసీ రోడ్లు 6,167 కి.మీ
  • నగరంలో మొత్తం రోడ్ల పొడవు 9,013 కి.మీ
  • అందులో బీటీ రోడ్లు  2,846 కి.మీ

రూ.వేల కోట్లు.. అయినా రోడ్లకు తూట్లు..

నగరంలో నాలుగు లైన్లు, అంతకన్నా ఎక్కువ వెడల్పు ఉండే 811 కి.మీ ప్రధాన రహదారులను జీహెచ్‌ఎంసీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చింది. ఐదేళ్ల నిర్వహణకు రూ.1,839 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. మొదటి మూడేళ్లలో పలు ప్రాంతాల్లో నూతన రోడ్లు నిర్మించాలి. తర్వాత రెండేళ్లు గుంతలు పడకుండా చూసుకోవాలి. కానీ ప్రైవేటు రోడ్లపై ఎక్కడ చూసినా భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి.

  • నగరంలో కాలనీ రోడ్లను తాగునీరు, మురుగునీటి పైపులైన్లు, విద్యుత్తు కేబుళ్ల కోసం తరచుగా తవ్వుతున్నారు. మరమ్మతులు మాత్రం చేయడం లేదు.
  • గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ ఏటా రూ.25 కోట్లు వెచ్చించి ఐఆర్‌టీ బృందాలను నియమిస్తుంది. ఇంజినీర్లు ఆయా బృందాల వద్ద కమీషన్లు తీసుకుని, పనులు చేయకున్నా.. బిల్లులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని