logo

అనారోగ్యంతో యువతి మృతి

జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ.. మృతి చెందిన సంఘటన పరిగి పట్టణంలో శుక్రవారం జరిగింది.

Updated : 25 May 2024 05:24 IST

చికిత్స చేసిన వైద్యులపై చర్యలకు తండ్రి డిమాండ్‌

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ.. మృతి చెందిన సంఘటన పరిగి పట్టణంలో శుక్రవారం జరిగింది. పరిగి ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దోమ మండల కేంద్రానికి చెందిన ఎండీ రుక్మొద్దీన్‌ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి. కుమార్తె యాస్మిన్‌ బేగం(22)కు జ్వరం రావడంతో ఈనెల 22న పరిగిలోని సాయి శ్రేణిక్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ ప్రదీప్‌ వద్ద వైద్యం చేయించారు. ఆయన రాసిచ్చిన మందులు తీసుకుని గ్రామానికి వెళ్లారు. ఆర్‌ఎంపీ భాగ్యలక్ష్మి పరిశీలనలో రెండు రోజులు మందులు వాడారు. 23న ఆమె దేహంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో పట్టణంలోని శ్రీబాలాజీ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 24న అపస్మారక స్థితికి చేరుకుంది. పరీక్షించిన డాక్టర్‌ అభినవ్‌ సీపీఆర్‌ చేసి పరిస్థితి విషమించడంతో వెంటనే ఓ ఆసుపత్రికి పంపారు. అప్పటికే యువతి శరీరంపై దద్దుర్లు, మచ్చలు వచ్చాయి. హైదరాబాద్‌లోని వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తన బిడ్డ మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రుక్మొద్దీన్‌ పరిగి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ సాయి శ్రేణిక్‌ ఆస్పత్రి వైద్యుడు ప్రదీప్‌ను వివరణ కోరగా.. యాస్మిన్‌కు మొదటి రోజు చికిత్స అందించానని.. అందులో ఏ పొరపాటు జరగలేదన్నారు. ఆమె మృతికి కారణాలు తెలియవని పేర్కొన్నారు.


న్యాయమూర్తి వినూత్న తీర్పు

తాండూరు టౌన్, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన వారికి తాండూరు స్పెషల్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ న్యాయమూర్తి నామాల అశోక్‌ వినూత్న తీర్పు ఇచ్చారని తాండూరు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గురువారం పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, పట్టణానికి చెందిన యూసుఫ్, సమీర్, అబుబ్‌కర్‌ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా, అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం కేసును పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి వినూత్న శిక్ష విధించారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు, పట్టణంలోని మసీదు వద్ద ఉండే పేదవారికి పండ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ మేరకు పండ్లు పంపిణీ చేయించామన్నారు.


పోలీసుల తీరు సరికాదు

తాండూరు టౌన్, న్యూస్‌టుడే: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ నాయకుడు శ్రీనివాస్‌ విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  ప్రజా,విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన కానిస్టేబుల్‌ సత్తార్, ఎస్సై కాశీనాథ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఫైనాన్స్‌ నిర్వాహకులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేయటానికి స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాస్‌ను కానిస్టేబుల్‌ ఈడ్చుకుంటూ తీసుకువెళ్లడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, విజయలక్ష్మీ పండిత్, సోమశేఖర్, గీత, మహేందర్, చంద్రయ్య, రామకృష్ణ, అశోక్, సంజయ్‌గౌడ్, బుగ్గప్ప, దీపక్‌రెడ్డి, వెంకట్, అనిల్, చెన్నప్ప, మల్లేష్, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కల్లు సీసా విషయమై ఘర్షణ

వికారాబాద్, న్యూస్‌టుడే: కల్లు సీసా విషయంలో ఘర్షణ పడి, పరస్పరం దాడులు చేసుకున్న ఐదుగురిపై కేసు నమోదు చేసిన సంఘటన వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధి గిరిగిట్‌పల్లిలో శుక్రవారం జరిగింది. వికారాబాద్‌ సీఐ నాగరాజు తెలిపిన ప్రకారం పట్టణంలోని ఆలంపల్లికి చెందిన శ్రీనివాస్, శంకర్‌ గిరిగిట్‌పల్లికి వెళ్లి రెండు సీసాల కల్లు తీసుకున్నారు. మరో సీసా కల్లు ఇవ్వమని అడగగా నిర్వాహకురాలికి, కొనుగోలుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్, శంకర్‌పై దుకాణ నిర్వాహకురాలి కుమారుడు చరణ్‌గౌడ్, భర్త దత్తుగౌడ్‌ దాడి చేయగా, వీరు కూడా తిరగబడ్డారు. వికారాబాద్‌ పోలీస్‌ఠాణాలో పరస్పరం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని