logo

కమిటీల ఏర్పాటు.. ఉద్యోగినులకు తోడ్పాటు

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది.

Published : 25 May 2024 02:54 IST

వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొదటగా మున్సిపల్‌ కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పురపాలికలు ఆ దిశగా దృష్టి సారించాయి. పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై వేధింపులు కొనసాగుతున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని  పలు స్వచ్ఛంద సంస్థలు, వామ పక్ష నాయకులు కూడా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా చాలా చోట్ల ఇదే విషయమై ఆరోపణలు రావడంతో రాష్ట్ర పురపాలిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

జిల్లా కేంద్రంలో కమిటీ ఏర్పాటు చేయగా,  తాండూరు, పరిగి, కొడంగల్‌లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. గతంలో అనేక సార్లు జిల్లాలో సంఘటనలు జరిగినా బయటకు రాకుండా చేశారు. ఇకపై ఉద్యోగినులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి విషయాలను ఊపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఉత్తర్వులు ఏప్రిల్‌లో జారీ అయినా,  లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిమగ్నమై ఉన్నందున వీటి ఏర్పాటుపై దృష్టి సారించలేదు. పోలింగ్‌ ముగియడంతో కమిటీల ఏర్పాటుపై కమిషనర్లు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో వివిధ హోదాల్లో మహిళా ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

నియామకం ఇలా: పురపాలికల్లో విధులు నిర్వహించే మహిళకు రక్షణ కల్పించేందుకు 2013లో వచ్చిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి సీనియర్‌ మహిళా ఉద్యోగినిని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. వారు లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల వారికి  బాధ్యతలు అప్పగించాలని సూచించింది. అధికారితోపాటు మరో ఇద్దరిని సభ్యులుగా నియమిస్తారు. వీరికి మహిళా చట్టాలపై అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి. సమస్యలపై పోరాటం చేసే ప్రైవేట్‌ వ్యక్తులకు అవకాశం కల్పించాలని అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉద్యోగినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కమిటీ విచారించి ఉన్నతాధికారులకు పూర్తి నివేదికను సమర్పించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా తోడ్పాటు అందిస్తుంది. వీటి ఏర్పాటుతో రక్షణ లభిస్తుందని పలు మహిళా సంఘాలు ఆశిస్తున్నాయి. వికారాబాద్‌ పురపాలికలో ముగ్గురు మహిళా ఉద్యోగినులతో కమిటీ ఏర్పాటు చేశామని వికారాబాద్‌ మున్సిపల్‌  కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ తెలిపారు. పని ప్రదేశంలో వేధింపులకు గురి చేస్తే దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని