logo

రక్తశుద్ధి.. ఆరోగ్య సిద్ధి

మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు సర్కార్‌ దవాఖానాల్లో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Updated : 25 May 2024 05:23 IST

అందుబాటులో కేంద్రాలు, బాధితులకు సాంత్వన  

చికిత్స పొందుతున్న రోగులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి, తాండూరు టౌన్, కొడంగల్‌: మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు సర్కార్‌ దవాఖానాల్లో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌ స్థాయిలో ఆధునిక వసతులు కల్పించి వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతో బాధితులకు హైదరాబాద్‌ వెళ్లే అవస్థలు తప్పాయి. స్థానికంగా ఉచిత సేవలు అందడంతో వారికి ఊరట కలిగింది. అయితే కొన్ని చోట్ల వసతులు సరిగా లేవని పూర్తిస్థాయిలో కల్పించాలని వారు కోరుతున్నారు.  తాండూరు జిల్లా ఆసుపత్రి, వికారాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, పరిగి, కొడంగల్‌ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తశుద్ధి సేవలను అందిస్తున్నారు. వికారాబాద్‌లో 2018 జనవరిలో సేవలు ప్రారంభించడంతో వికారాబాద్‌ పరిసర మండలాలతో పాటు, ఇతర మండలాలకు చెందిన వారు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. పరిగి కేంద్రంలో కుల్కచర్ల, దోమ, పూడూరు మండలాల వారు, తాండూరు, కొడంగల్‌లో ఆ పరిసర గ్రామాల వారు కేంద్రాలను వినియోగించుంటున్నారు. కొడంగల్‌ కేంద్రంలో ఫర్నిచర్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులను బయట తెచ్చుకోమ్మని అక్కడి సిబ్బంది సూచిస్తున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 23 పడకలు: తాండూరులో 8, వికారాబాద్, పరిగి, కొడంగల్‌ కేంద్రాల్లో 5 చొప్పున పడకలున్నాయి. తాండూరు 50, వికారాబాద్‌ 40, పరిగి 30, కొడంగల్‌ 35 మందికి సేవలు అందుతున్నాయి. పడకల ప్రకారం రక్తశుద్ధి చేస్తున్నారు. ఒక్కొక్కరికి నాలుగు గంటల పాటు సేవలందిస్తున్నారు. మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

అంతా అధునాతనమే: డయాలేజర్‌ను మామూలుగా రోగికి 12, 13 సార్లు వినియోగిస్తారు. ప్రతి రోగికి ఒక పరికరాన్ని వినియోగించేలా జర్మనీ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ అధునాతనమైన విధానం కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులో ఉంది. గతంలో వైద్యానికి నగరానికి వెళ్లిన ప్రతి సారి ఒక్కరికి అన్ని ఖర్చులు కనీసం రూ.10 వేల నుంచిరూ.15 వేల వరకు అయ్యేది. ఇప్పుడా పరిస్థితి తప్పింది.  

పింఛన్‌ సౌకర్యం: రక్తశుద్ధి చేయించుకునే వారికి నెలకు రూ.2016 పింఛన్‌ అందుకుంటున్నారు. నాలుగు కేంద్రాల్లోని చికిత్స పొందుతున్న వారికి ఇది వర్తిస్తుంది. డయాలసిస్‌ చేసుకుంటున్నట్లు ధ్రువపత్రంతో దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ మంజూరు చేస్తారు.


40 మందికి సేవలందిస్తున్నాం

- మహ్మద్‌ రిజ్వాన్, ఇన్‌ఛార్జి, వికారాబాద్‌

ఈ కేంద్రంలో ప్రస్తుతం 40 మందికి రక్తశుద్ధి చేస్తున్నాం. ఒక్కొక్కరికి నెలకు 12 సార్లు సేవలు అందించాల్సి ఉంటుంది. వికారాబాద్‌ పరిసర మండలాలకు చెందినవారు, స్థానికులు ఇక్కడికి వస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చికిత్స చేస్తున్నాం. ముందుగా పేరు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోగికి నెలకు నాలుగు ఇంజక్షన్లు ఇస్తాం. అంతే కాకుండా ఇనుముకు సంబంధించినవి రెండు ఇస్తాం.


పింఛన్‌ రావడం లేదు: జ్ఞానేశ్వర్, ధన్నారం

జనవరి నుంచి పింఛన్‌ రావడం లేదు. ఎందుకు నిలిపివేశారో తెలియడం లేదు. 2021 నుంచి చికిత్స చేయించుకుంటున్నా. వికారాబాద్‌లో కేంద్రం ఏర్పాటుతో రోగులకు సౌకర్యంగా మారింది.


సేవలు బాగున్నాయి

- ఎల్లయ్య, బూచన్‌పల్లి, మర్పల్లి

వికారాబాద్‌ కేంద్రంలో సేవలు బాగున్నాయి. ఆరు నెలలుగా చికిత్స పొందుతున్నా. పింఛన్‌ ఇస్తారన్న విషయం ఇప్పుడే తెలిసింది. దరఖాస్తు చేస్తా. ప్రభుత్వ దవాఖానాలో సేవలు అందించడం మంచి పరిణామం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని