logo

పాత ఇళ్ల పై నిర్లక్ష్యం వద్దు

నగరానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఏళ్ల నాటి కట్టడాలు నగరంలో కనిపిస్తుంటాయి.

Published : 25 May 2024 03:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఏళ్ల నాటి కట్టడాలు నగరంలో కనిపిస్తుంటాయి. వర్షాకాలం మొదలవడంతో వాటి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. నగరవ్యాప్తంగా సర్వే చేపట్టింది. 459 శిథిల భవనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్నవి, మరమ్మతులతో కాపాడుకోగలిగినవి వంటి పలు విభాగాలుగా విభజించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌  తెలిపారు. జీహెచ్‌ఎంసీ గుర్తించిన శిథిల భవనాల్లో సగం మేర మట్టిగోడలతో కట్టిన పెంకుటిళ్లు రేకుల షెడ్లు, గుడిసెలు ఉండగా.. మరో సగం రాతి కట్టడాలు, పాత కాలం నాటి బంగ్లాలు ఉన్నాయి. మట్టి గోడలతో ఉన్న నిర్మాణాలు ఎప్పటికైనా ప్రమాదమేనని, వాటిని కూల్చి కొత్త భవనాలను నిర్మించుకోవడం ఉత్తమమని ఇంజినీర్లు సూచిస్తున్నారు. రాతి గోడలు, ఉక్కు దిమ్మెలతో నిర్మించిన భవనాలను మాత్రం.. ఇంజినీర్ల సూచనతో కొత్తగా తీర్చిదిద్దుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గోడల పటిష్టతను శాస్త్రీయంగా పరీక్షించాక, వాటి నాణ్యత ఆశాజనకంగా ఉన్నప్పుడు.. పాత పైకప్పును తొలగించి, బంగ్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చే చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేస్తున్నారు.

గుర్తించిన వాటిలో..

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 459 శిథిల భవనాలను గుర్తించగా, గతేడాది బల్దియా పరిధిలో 231 శిథిల భవనాలను కూల్చివేశామని, 294 భవనాలకు మరమ్మతులు జరిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ప్రమాదకరంగా ఉన్న భవనాలపై దృష్టి పెట్టామని, కూల్చక తప్పదనుకున్న వాటిని ఇంజినీరింగ్‌ నిపుణుల సూచన మేరకు నేలమట్టం చేస్తున్నామని, కొన్నింటికి మరమ్మతులు చేసుకునేలా యజమానులకు అవకాశం ఇవ్వడం, మరికొన్నింటికి తాళం వేయడం, ఇతరత్రా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రణాళికా విభాగం తెలిపింది. పౌరులు సైతం 040-2111 1111కు ఫోన్‌ చేసి వర్షాకాలం కూలే అవకాశమున్న నిర్మాణాల గురించి సమాచారం ఇవ్వొచ్చని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని