logo

ఘాటుగా చెప్తేనే వింటారా?

ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలను నియంత్రించడానికి వీవోసీ వోలటైల్‌ (ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌) మీటర్లు బిగించాలని పీసీబీ ఆదేశిస్తున్నా.. కొందరు పరిశ్రమల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

Published : 25 May 2024 03:09 IST

పరిశ్రమల్లో వాసనల నియంత్రణకు చర్యలేవీ?
ఈనాడు, హైదరాబాద్‌

ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలను నియంత్రించడానికి వీవోసీ వోలటైల్‌ (ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌) మీటర్లు బిగించాలని పీసీబీ ఆదేశిస్తున్నా.. కొందరు పరిశ్రమల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కార్మికులు తిరిగే ప్రాంతాలు, నివాస స్థలాలకు సమీపంలో ఉన్న పరిశ్రమల్లో వీటిని బిగించి ఉద్గారాలను తగ్గించాలని పీసీబీ సూచిస్తోంది. వీవోసీ హ్యాండ్‌ మెషీన్లు, ఆన్‌లైన్‌ మీటర్లు బిగించి పీసీబీ సర్వర్‌కు అనుసంధానించాలని చెబుతున్నా.. ఖర్చుతో పాటు నిఘా ఉంటుందని కొందరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఆయా పరిశ్రమలపై పీసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమల నిర్లక్ష్యంతో వాయునాణ్యతను ప్రభావితం చేసే బెంజీన్, ఇథిలీన్‌ గ్లైకాల్, ఫార్మాల్డిహైడ్, మిథైలీన్‌ క్లోరైడ్, టెట్రాక్లోరో ఇథైలీన్, టోలున్, జీలిన్‌ వంటి అస్థిర కర్బన సమ్మేళనాలు గాలిలో కలిసి వాయునాణ్యతపై ప్రభావం పడుతోంది.

కొన్నింటిపై చర్యలు.. మరికొన్నింటికి సూచనలు

అనుమతులు లేకుండా బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తులు తయారు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా రెండు కేఎల్‌ సామర్థ్యంతో రియాక్టర్ల ఏర్పాటు, సింగిల్‌ స్టేజ్‌ స్క్రబ్బర్ల వినియోగంతో కాలుష్య ఉద్గారాలు పెరగడంతో మేడ్చల్‌కు చెందిన కొఠారు ల్యాబరేటరీస్‌పై పీసీబీ చర్యలు తీసుకుంది. మూసివేతకు ఆదేశాలిచ్చింది. ఆ సంస్థ కొన్ని నెలలకే నిబంధనల ప్రకారం పీసీబీ సూచించిన మేరకు స్క్రబ్బర్లు, బాయిలర్లు ఏర్పాటు చేయడంతో తిరిగి ఆ పరిశ్రమ తెరిచేందుకు ఆమోదం తెలిపింది. జీడిమెట్లలోని లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌కు పీసీబీ పలు మార్గదర్శకాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉద్గారాలు వదులుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి వీవోసీ మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేలా స్క్రబ్బర్‌కి హెచ్‌టీడీఎస్‌ ఎఫ్లూయెంట్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు అనుసంధానించాలని సూచించింది. వీవోసీ మానిటరింగ్‌ వ్యవస్థ, వెంట్‌ కండెన్సర్‌ల వినియోగంతో ఉద్గారాలు నియంత్రించాలని సూచించింది. మల్లాపూర్‌కు చెందిన మురళి కెమికల్స్, శోధన ల్యాబరేటరీస్‌కు ఉద్గారాల నియంత్రణకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఖర్చుతో పాటు నిఘా ఉంటుందనే..

నగరంలో 1500కు పైగా రెడ్‌ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి వాతావరణంలో వాయునాణ్యత, గాలిలో కలిసే అస్థిర కర్బన సమ్మేళనాల స్థాయులను తెలుసుకునేలా ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థను పీసీబీ సర్వర్‌కు అనుసంధానించాలన్న నిబంధనలు ఉన్నాయి. కాలుష్యం పెరిగినప్పుడల్లా అప్రమత్తం చేయడంతో పాటు ఎందుకు పెరుగుతుందో వివరాలు సమర్పించాలని పీసీబీ సదరు నిర్వాహకులకు నోటీసులు పంపుతుంది. వివరణ ఇచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంటే టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని పంపి లోపాలు ఎక్కడున్నాయో గుర్తించి మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఆన్‌లైన్‌ మెషీన్లకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుండటం, పైగా పీసీబీ నిఘా ఉంటుందని నిర్వాహకులు వీటిని వినియోగించడం లేదు. దీంతో ఘాటు వాసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులు పీసీబీకి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయా పరిశ్రమల సమీపంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీ చేసినప్పుడల్లా 5 పీపీఎం కంటే ఎక్కువగానే సూచిక చూపుతుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని