logo

పనులు నత్తనడక.. మంచినీళ్లు సరిపడక..

రాజధాని నగర శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార యంత్రాంగం సరఫరా చేస్తున్న తాగునీరు ఏమాత్రం సరిపోవడం లేదు.

Updated : 25 May 2024 05:19 IST

శివారు మున్సిపాలిటీలకు అరకొరగా సరఫరా
నీళ్లు నిల్వలేని ట్యాంకర్లు, పూర్తికాని పైప్‌లైన్లు
ఈనాడు,హైదరాబాద్, న్యూస్‌టుడే, ఘట్‌కేసర్, తుర్కయాంజాల్‌ పురపాలిక

తుర్కయాంజాల్‌లోని రిజర్వాయర్‌

రాజధాని నగర శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార యంత్రాంగం సరఫరా చేస్తున్న తాగునీరు ఏమాత్రం సరిపోవడం లేదు. వేసవిలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, తాగునీటి పీపాలను కొనుక్కొంటున్నారు. గ్రేటర్‌ సరిహద్దు దాటిన వెంటనే ఉన్న ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో.. మరికొన్ని చోట్ల మూడురోజులకోసారి నీళ్లొస్తున్నాయి. బాహ్యవలయ రహదారిలోపలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు రెండేళ్ల క్రితం రూ.1750 కోట్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేయగా.. రూ.982కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా నిధుల కొరత, సమన్వయలేమి కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. జలమండలికి సమాంతరంగా మిషన్‌ భగీరథ అధికారులు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, తాగునీటి పైప్‌లైన్ల పనులు ప్రారంభించినా.. అవికూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.

ఖాళీగా రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకర్లు..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీటి అవసరాల కోసం అన్నిచోట్లా రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకర్లను నిర్మించారు. పైప్‌లైన్‌ల ద్వారా రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకర్లలో నీటిని నిల్వ ఉంచి కాలనీలు, వార్డులకు సరఫరా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకర్ల నిర్మాణం పూర్తైనా వాటిల్లో నీళ్లు నింపేందుకు జలమండలి, మిషన్‌ భగీరథ అధికారుల వద్ద నీటినిల్వలు లేవు. గతేడాది శాసనసభ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రభుత్వం తాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పుకొనేందుకు రెండు,మూడు రోజుల పాటు ట్రయల్‌ రన్‌ ద్వారా వాటిని అందించింది. ప్రభుత్వం మారిపోయాక అధికారులు పెండింగ్‌ పనులకు నిధుల్లేక నిదానంగా పనులు చేస్తున్నారు. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కోసం రిజర్వాయర్‌ నిర్మించినా.. దానికి అవుట్‌లెట్‌ లేకపోవడంతో నీటిని నిల్వచేయడం లేదు.

పోచారం మున్సిపాలిటీనీళ్ల ట్యాంక్‌

కార్పొరేషన్లలో కటకట..  

మూడు లక్షలకుపైగా జనాభా ఉన్న నిజాంపేట కార్పొరేషన్‌కు జలమండలి, మిషన్‌ భగీరథ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో 13వేల నల్లాకనెక్షన్లు ఉండగా.. 33ఎంఎల్‌డీల నీరు ఇవ్వాలి. అధికారులు సరఫరా చేస్తోంది 25ఎంఎల్‌డీలే.

  • బండ్లగూడజాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేస్తున్న నీటిసరఫరా అస్తవ్యస్తంగా మారింది. డిమాండ్‌కు అనుగుణంగా  సరఫరా చేయకపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్పొరేషన్‌ పరిధిలో 1.50 లక్షల జనాభా, 149 కాలనీలు.. 35వేలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. కొన్ని కాలనీలకు ఇప్పటికీ తాగునీటి సరఫరా వ్యవస్థ లేదు.
  • పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో రోజుకు కోటి లీటర్ల డిమాండ్‌ ఉండగా... యాభైలక్షల లీటర్లు మాత్రమే అధికారులు సరఫరా చేస్తున్నారు. పైపులైన్ల కోసం రూ.150కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు చెపుతున్నా కొన్ని ప్రాంతాల్లో నేటికీ నాలుగైదు రోజులకోసారి కానీ తాగునీరు అందడం లేదు.
  • బోడుప్పల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని 28 డివిజన్లలో నివసిస్తున్న ప్రజలు తాగునీటికోసం ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తున్నారు. సుమారు 3 లక్షల జనాభా నివస్తున్న బోడుప్పల్‌లో చెంగిచర్ల ప్రాంతం అదనం. దాదాపు 100 కాలనీలకు సరైన నీటి సరఫరా యంత్రాంగమే లేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని