logo

కళ్లలో కారం కొట్టినా.. దొంగలతో కలబడింది

హెల్మెట్, మాస్క్‌లు ధరించిన గొలుసుదొంగలు దారిదోపిడీకి పాల్పడ్డారు.

Updated : 25 May 2024 05:18 IST

తల్లీకూతుళ్లపై దాడి చేసి గొలుసు చోరీ
ప్రతిఘటించిన మహిళ.. బైక్‌ వదిలి పారిపోయిన దుండగులు

పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: హెల్మెట్, మాస్క్‌లు ధరించిన గొలుసుదొంగలు దారిదోపిడీకి పాల్పడ్డారు. తల్లీకూతుళ్లపై కర్రతో దాడిచేసి రూ.86వేల విలువచేసే బంగారు గొలుసును లాక్కెళ్లారు. పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి కథనం ప్రకారం... మహేశ్వరం మండలం మంఖాల గ్రామానికి చెందిన జి.మహేందర్‌ భార్య కల్పన(32) ప్రతిరోజూ తెల్లవారుజామున ఉదయనడక చేస్తుంది. రోజూమాదిరిగానే శుక్రవారం ఆమె తన పిల్లలు లక్ష్మీప్రసన్న(13), హేమచందర్‌(9), హేమంత్‌(8)లతో పాటు పక్కింటి పిల్లలు పావని, నేహాశ్రీ, మనీష్‌కుమార్‌లతో కలిసి తుక్కుగూడ ఔటర్‌రింగురోడ్డు పక్క మార్గంలో శంషాబాద్‌ వైపున ఉదయనడకకు వెళ్లి తిరిగి వస్తున్నారు. మధ్యలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు (ఒకరు తలకు హెల్మెట్, మరొకరు మాస్క్‌లు ధరించి) తారసపడ్డారు. సీసాల్లో నీళ్లు తాగుతున్నట్లు కనిపించారు. కానీ ఆ సీసాల్లో ఎర్రటి కారం కలిపి ఉంది. పిల్లలతో కల్పన వారి వద్దకు రాగానే సీసాల్లోని నీళ్లను ఆమె కళ్లలో కొట్టారు. వెంటనే ఆమె షాక్‌కు గురై కళ్లు మూసుకుంది. ఇదే అవకాశంగా భావించిన వారు పిల్లలను తోసి, ఆమెపై కర్రతో దాడిచేసి మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కున్నారు. అడ్డుపడిన కూతురు లక్ష్మీప్రసన్నను తలపై కర్రతో బాదడంతో కుప్పకూలింది. ఆగ్రహంతో కల్పన కళ్లలో కారం ఉన్నా దోపిడీదారులను అడ్డుకుని.. వారి ద్విచక్రవాహనం తాళాలను లాక్కొని కేకలు వేసింది. వెంటనే వాహనాన్ని వదిలిన దొంగలు శంషాబాద్‌వైపు పరుగెత్తి మాయమయ్యారు. విషయం తెలిసిన స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దొంగల కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు తలపై బలమైన గాయాలైన తల్లీకూతుళ్లను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని