logo

బడి బస్సులు.. ఫిట్‌‘లెస్‌’

మరో 20 రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే బడి బస్సులు, వ్యాన్లకు సంబంధించి సామర్థ్య పరీక్షలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది.

Updated : 25 May 2024 05:17 IST

గతేడాది 1,500 బస్సుల యజమానులకు నోటీసులు
పాఠశాలలు మొదలయ్యేలోగా.. సామర్థ్య పరిశీలన తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: మరో 20 రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే బడి బస్సులు, వ్యాన్లకు సంబంధించి సామర్థ్య పరీక్షలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. గతేడాది పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా 1,500 వరకు బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నట్లు రవాణాశాఖ గుర్తించి నోటీసులు జారీ చేసింది. గ్రేటర్‌ వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్‌ తదితర చోట్ల మొత్తం 10-12 వేలకు పైనే పాఠశాలలు, కళాశాలల బస్సులు తిరుగుతున్నాయి. మరో 10 వేల వరకు మినీ వ్యాన్లు ఉన్నాయి. జూన్‌ 12న పాఠశాలలు తెరిచేలోపు ప్రతి బస్సు సంబంధిత రవాణాశాఖ వద్ద సామర్థ్య పరిశీలన చేసుకొని ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.

చూసీచూడనట్లుగా.. ప్రమాదకరంగా..

ఏటా ఈ ఫిట్‌నెస్‌ పరిశీలన లోపభూయిష్టంగా జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. కొందరు ఆర్టీఏ సిబ్బంది డబ్బులు తీసుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా తరచూ పాఠశాల బస్సులు, వ్యాన్లు పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి మినీ వ్యాన్లు నడుపుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలు నిర్ణయిస్తున్నారు. ఆరేడుగురు విద్యార్థులను కూర్చోబెట్టాల్సిన వ్యాన్లలో 10-12 మందిని కుక్కుతున్నారు. వాటిలో చాలా వరకూ ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. 10-15 ఏళ్లు దాటిన వ్యాన్లను కొని రంగులు వేసి కొత్తవిగా చూపుతున్న పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రమాదకర రీతిలో పిల్లలను తరలిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభానికి ముందే అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సి అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని